జయలలిత మరణం ఓ మిస్టరీ. ఆమె ఆరోగ్యం గురించి ఎవరికీ తెలియనీయకుండా చేసి… ఆమె చనిపోయిన తర్వాత ప్రకటన చేసి అంత్యక్రియలు చేయించేసి.. అంతే వేగంగా సీఎం పదవి చేపట్టాలనుకున్న శశికళ .. కథ అడ్డం తిరగడంతో అక్రమాస్తుల కేసుల్లో జైలుకు వెళ్లింది. ఆమె అలా జైలుకెళ్లడంతో జయలలిత మరణంపై విచారణ కూడా మందగించింది. ఇప్పుడు ఆమె బయటకు వచ్చేసింది. మళ్లీ రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు మరోసారి జయలలిత మరణంపై విచారణ కమిటీ వెలుగులోకి వచ్చింది. జస్టిస్ ఆర్ముగం స్వామి ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఇప్పుడు శశికళ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది.
రిపోర్టులు.. విచారణలు ఏమి తేల్చాలన్నది పక్కన పెడితే .. జయలలిత విషయంలో శశికళ వ్యవహారాన్ని అందరూ తప్పు పడతారు. ఓ ముఖ్యమంత్రి ఆరోగ్య విషయాలను గోప్యంగా ఉంచారు. ఎలాంటి వైద్యం చేయాలో కూడా ఆమే సూచించినట్లుగా అపోలో వైద్యులు చెప్పడం ఆశ్చర్యకరం. జయలలిత ఆరోగ్యంపై ఎప్పుడూ నిజాలు చెప్పలేదు. అంతా గోప్యంగా వ్యవహారం ఉంచారు. అంతా బాగుందనుకున్న సమయంలో హఠాత్తుగా ఆమె మరణాన్ని ప్రకటించారు. జయలలిత పూర్తిగా శశికళ చేతిలో బందీ అయ్యారనేది అందరికీ తెలిసిన విషయం. ఆమె మరణంలోనూ శశికళ పాత్ర లేదని ఎవరూ నమ్మడం లేదు.
దానికి తగ్గట్లుగానే ఆమె జయలలిత చనిపోయిన తర్వాత అచ్చంగా జయలలిత తరహాలోనే ఆహార్యం మార్చుకుని రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. పన్నీర్ సెల్వంను దించేసి పదవి చేపట్టాలనుకున్నారు. కానీ కథ అడ్డం తిరిగింది కాబట్టి జైలుకెళ్లింది. లేకపోతే.. తమిళనాడు సీఎం అయి ఉండేవారు. ఇప్పుడు ఎలాంటి కమిటీలు అయినా సరే.. నిజం వెల్లడిస్తే శశికళ నిండా మునిగిపోవడం ఖాయమని తమిళనాట జోరుగా ప్రచారం సాగుతోంది. ఆమె గతంలో ప్రకటించినట్లుగా రాజకీయ సన్యాసం తీసుకుంటే ఎవరూ పట్టించుకునేవారు కాదేమో కానీ ఇప్పుడు రాజకీయాల్లో మళ్లీ రావాలనుకోవడం వల్లనే సమస్య వస్తోందని రాజకీయవర్గాల అంచనా.