వైయస్ షర్మిల తెలంగాణలో సొంతంగా పార్టీ ఏర్పాటు చేస్తోంది అన్న మీడియా కథనాలు గత కొద్ది రోజులుగా రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అయితే ఇవి మీడియా ఊహాగానాలా లేక నిజంగానే ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయా అన్న విషయంపై స్పష్టత లేకపోయినప్పటికీ ఫిబ్రవరి 9వ తేదీన షర్మిల తన సొంత రాజకీయ పార్టీని తెలంగాణలో లాంచ్ చేయనుంది అన్న వార్తలు రాజకీయవర్గాలలో జోరు గా వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
ఇప్పటికే పార్టీ రిజిస్ట్రేషన్ పూర్తయింది అంటున్న గోనె ప్రకాశ్ రావు:
ఆదివారం రోజున ఒక పత్రికలో షర్మిల పార్టీ పెట్టబోతోంది అంటూ వచ్చిన కథనాలు సంచలనం సృష్టిస్తే, మర్నాడు సాక్షి పత్రికలో ఆ కథనాన్ని ఖండిస్తూ షర్మిల పేరిట ఒక లేఖ విడుదలైంది. అయితే , షర్మిల దీని గురించి ఎటువంటి వీడియో విడుదల చేయకపోవడంతో, ఆ లేఖ నిజంగా షర్మిలే రాసిందా అన్న సందేహాలు కలిగాయి. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న చర్చ ప్రకారం వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయురాలు అయిన వైయస్ షర్మిలకు సొంత రాజకీయ ఆశయాలు ఉన్నాయని, తన ఆశయాల మేరకే ఆవిడ సొంతంగా పార్టీ పెట్టడానికి ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభించిందని తెలుస్తోంది. తెలంగాణలో వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అయిన గోనె ప్రకాశ్ రావు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో షర్మిల రాజకీయ ఉద్దేశ్యాలు గురించి పలు ఆసక్తి కర విషయాలు వెల్లడి చేశారు. షర్మిల కు మొదటి నుండి కూడా రాజకీయ పరమైన ఆశయాలు ఉన్నాయని, ఇంకా చెప్పాలంటే జగన్ కంటే కూడా షర్మిల దృఢమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని ఆయన షర్మిల ను ఆకాశానికి ఎత్తేశారు. జగన్ పాదయాత్ర ఉదయం 11 గంటలకు మొదలుపెట్టి సాయంత్రం 5:30 కల్లా ముగించేసి , ఆయన హెలికాప్టర్లో హైదరాబాద్ వెళ్లే వారని, కానీ షర్మిల మాత్రం రోజంతా యాత్ర చేసేదని ఆయన చెప్పుకొచ్చారు. జగన్ జైల్లో ఉన్న సమయంలో ఆమె చేసిన పాదయాత్ర కారణంగానే అప్పట్లో పలు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలిచిందని, 2019 ఎన్నికలకు ముందు సైతం జగన్ పాదయాత్ర కవర్ కాని కొన్ని ప్రాంతాలలో షర్మిల పాదయాత్ర చేసిందని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా రాజశేఖర్ రెడ్డికి కొడుకు కంటే కూడా షర్మిల అంటేనే ఎక్కువ అభిమానం అని, ప్రతి చిన్న ఆస్తి లో కూడా జగన్ కు సమానంగా షర్మిల కి ఆయన పంచారని గోనె ప్రకాశరావు చెప్పుకొచ్చారు. అయితే జగన్ తనకు రాజ్యసభ సీటు ఆఫర్ చేసి మడమ తిప్పాడా, లేక ముఖ్యమంత్రి అయిన తరవాత ఆవిడను ఉద్దేశపూర్వకంగా దూరం పెట్టాడా అన్న విషయాలపై తాను వ్యాఖ్యానం చేయలేనని, కానీ ఒకటి మాత్రం తాను స్పష్టంగా చెప్పగలనని, షర్మిల సొంత పార్టీ కోసం ఎప్పుడో ప్రయత్నాలు ప్రారంభించిందని, పార్టీ రిజిస్ట్రేషన్ కూడా ఇప్పటికే పూర్తయిందని ఆయన చెప్పుకొచ్చారు.
మరో పది రోజుల్లో స్పష్టత:
గోనె ప్రకాశ్ రావు మాత్రమే కాకుండా, తెలంగాణకు చెందిన పలువురు నాయకులు ప్రత్యేకించి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు తెలంగాణలో షర్మిల పెట్టబోయే రాజకీయ పార్టీని ఆహ్వానిస్తున్నారు. అయితే ఇప్పటికే పార్టీ రిజిస్ట్రేషన్ సహా పలు అంతర్గత వ్యవహారాలు పూర్తయ్యాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో షర్మిల రాజకీయ పార్టీ మరో పది రోజుల్లో తెర వెనుక నుండి తెర మీదకి రానుందని చాలా గట్టి ప్రచారం జరుగుతోంది. జరుగుతున్న ఈ ప్రచారం నిజమే గనుక అయితే సాక్షిలో ఆంధ్రజ్యోతి కథనాన్ని ఖండిస్తూ వచ్చిన కథనం పచ్చి అబద్ధమే అని, సొంత కుటుంబ సభ్యుల కు సంబంధించిన అంశాల్లో కూడా సాక్షి అబద్ధపు కథనాలు రాయడానికి వెను కాడదని భావించాల్సి వస్తుంది.
ఏదిఏమైనా షర్మిల సొంత రాజకీయ పార్టీ కి సంబంధించిన కథనాలు మాత్రం రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం అవుతున్నాయి. మరో పది రోజుల్లో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశముంది.