సినిమా షూటింగ్ అంటే జాతర. ఎంత హడావుడీ అని..?
హీరో – ఆయనకు పది మంది సహాయకులు
హీరోయిన్ – ఆమె చుట్టూ కనీసం ఆరేడు మంది బ్యాక్
దర్శకుడు, సహాయ దర్శకులు, కెమెరామెన్లు, లైట్బాయ్స్, ప్రొడక్షన్ వాళ్లు.. వచ్చేవాళ్లు, వెళ్లేవాళ్లు, కార్ వ్యాన్లూ, డ్రైవర్లూ….
ఓహ్… ఎంత మందని?
కనీసం రెండొందల మంది కనిపించకపోతే… అది షూటింగ్ అనిపించుకోదు. ఇక రాజమౌళి లాంటి వాళ్ల సినిమాలైతే, జూనియర్ ఆర్టిస్టులే రెండొందల మంది కావాలి. యుద్ధాలు గట్రా ఉంటే వేల మందితో తెర నిండిపోవాలి.
అయితే… ఇప్పుడు ఇన్ని హంగులేం కనిపించకపోవొచ్చు. ఎందుకంటే కరోనా మహమ్మారికి అందరూ తలొంచాల్సిందే. ఆర్భాటాలూ, హంగులూ – కరోనాకి మరింత ఇష్టం. వెంటనే చొరబడిపోతుంది. అందుకే చావుకి పదిమంది, పెళ్లికి 20 మంది అంటూ ఫిక్సయ్యారు. సినిమా షూటింగులకు 30 నుంచి 40 మందే ఉండాలని రూల్ పెట్టినా ఆశ్చర్యం లేదు. ఆ పరిమితుల మధ్యే షూటింగులు జరగాలి. మరి.. అది సాధ్యమా? చేయగలరా? చేసినా… ఇది వరకటి నిండుదనం కనిపిస్తుందా?
అన్ని కార్యకలాపాలకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వాలు.. షూటింగుల దగ్గరకు వచ్చేసరికి కాస్త ఆలోచిస్తోంది. జనాలంతా గుంపులు గుంపులుగా ఉండాల్సిన చోటు అది. కరోనా మరింత విజృంభించే అవకాశం ఉంది. సినిమా లేకపోతే.. జనాలు బతగ్గలరు. ప్రపంచం అంతా మామూలుగానే నడుస్తుంది. అలాంటప్పుడు సినిమాల కోసం అంత రిస్కు తీసుకోవడం అవసరమా..? అన్నది వాళ్ల పాయింటు.
అదీ పాయింటే. సినిమాల్లేకపోయినా బతగ్గలం. కానీ.. అదే బతుకు అనుకున్నవాళ్ల పరిస్థితేంటి? చావైనా, బతుకైనా సినిమాతోనే అనుకున్నవాళ్లు ఎలా బతగ్గలరు? అందుకే `మా మీద దయ చూపించండి` అన్నది సినిమా వాళ్ల ఆవేదన. తక్కువ మందితో షూటింగులు చేసుకోగలం.. అన్నది వాళ్ల నమ్మకం.
ఈ విషయమై ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ మాట్లాడుతూ “పరిమిత సభ్యులతో సినిమా షూటింగులు చేసుకోవడం కొత్తేం కాదు. ప్రతీ సినిమాలో గుంపులు గుంపులుగా జూనియర్ ఆర్టిస్టులు అవసరం ఉండదు. పది శాతం సన్నివేశాలు జూనియర్ ఆర్టిస్టుల్ని డిమాండ్ చేయొచ్చు. వాటిని కూడా సీజీతో సృష్టించుకునే టెక్నాలజీ మనకు అందుబాటులో ఉంది. 30 – 40 మంది మధ్య పరిమిత క్రూతో సినిమా చేసుకోగలం“ అంటున్నారు.
రాజమౌళి కూడా ఇదే మాట చెబుతున్నారు. కావాలంటే పరిమిత సభ్యులతో సినిమాని ఎలా తీయగలం? అనే విషయాన్ని ఓ మాక్ వీడియో ద్వారా చూపిస్తాం.. అని ధీమాగా చెబుతున్నారు. ప్రస్తుతం ఆ మాక్ వీడియోపైనే అందరి దృష్టీ పడింది. కరోనా బారీన పడకుండా, ప్రభుత్వ గైడ్ లైన్స్ ని పాటిస్తూ సినిమా షూటింగులు ఎలా జరుపుకుంటారో తెలియజేస్తూ ఓ మాక్ వీడియో తీయబోతోంది చిత్రసీమ. ప్రతీ సినిమాలోనూ వందలాది మంది జూనియర్ ఆర్టిస్టుల అవసరం లేదు. కృష్ణవంశీ సినిమాలా తెరంతా నటులు కనిపించాల్సిన పని లేదు. అలాంటి సన్నివేశాలు ఉంటే మార్చి రాసుకోవడమో, లేదంటే.. తగిన జాగ్రత్తలు తీసుకుని, సినిమా టెక్నిక్స్ వాడుకుని వాటిని పూర్తి చేయడమో చేయాలి.
కాకపోతే ఒకటి మాత్రం నిజం. ఇలాంటి పరిమితులు క్రియేటీవ్ పరంగా కొన్ని అడ్డంకుల్ని సృష్టిస్తుంటాయి. భవిష్యత్తులో ఎలాంటి సన్నివేశం రాసుకున్నా, కరోనానీ, ప్రభుత్వం ఇచ్చే గైడ్ లైన్స్నీ దృష్టిలో ఉంచుకుని కలం పట్టాల్సిందే. వాటికి అలవాటు పడిపోతే….. ఇక ఎలాంటి సమస్యా ఉండదు.