బాలకృష్ణ – శ్రుతిహాసన్ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పుడు చిరంజీవితోనూ శ్రుతిహాసన్ జోడీ కట్టబోతోందన్న వార్త వచ్చింది. ఇవి రెండూ వేర్వేరు సినిమాలు. శ్రుతి కెరీర్లో తప్పకుండా పెద్ద ప్రాజెక్టులు. కానీ ఇక్కడ మేటర్ ఏమిటంటే… చిరు, బాలయ్యల జనరేషన్ వేరు. శ్రుతి జనరేషన్ వేరు. జనరేషన్ల తేడా ఉన్న హీరోయిన్లతో మన హీరోలు నటించలేదా? అంటే .. నటించారు. కానీ .. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… శ్రుతి.. కమల్ కుమార్తె. చిరు, బాలయ్య, కమల్ హాసన్ ఒకే జనరేషన్ హీరోలు. దాదాపు ఒకేసారి వచ్చారు. ఒకేసారి స్టార్ డమ్ తెచ్చుకున్నారు. ఇప్పుడూ.. ఎవరి దారుల్లో వాళ్లు సినిమాలు చేస్తున్నారు. తమ జనరేషన్ లో ఉన్న హీరో కూతురితో… జట్టు కట్టి, డాన్సులు వేయడం అనేది చాలా ఇబ్బంది పడాల్సిన విషయం.
రామ్ చరణ్ తో జోడీ కట్టిన తమన్నా, కాజల్ లతో చిరు స్టెప్పులు వేశారు. తమ్ముడు పవన్ కల్యాణ్‌తో ఆడి, పాడిన హీరోయిన్లు కూడా చిరు పక్కన నటించారు. అప్పుడు పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. కాకపోతే.. తన జనరేషన్ హీరో కుమార్తెతో డ్యూయెట్లు పాడడం అనేది అంత బాగోదేమో అనిపిస్తోంది. ఇదే అడిగితే.. అటు బాలయ్య గానీ, ఇటు చిరు గానీ ఏం చెబుతారో తెలుసా? `సినిమాల్లో అదే చూడకూడదండీ.. కెమెరా ముందుకు వచ్చాక అన్నీ మర్చిపోవాలి.. మనం కళాకారులం` అని పాత పాట పాడతారు. కానీ ఇక్కడ నిజం ఏమిటంటే.. తెలుగులో హీరోయిన్ల కొరత బీభత్సంగా ఉంది. స్టార్ హీరోలకు హీరోయిన్లు అస్సలు దొరకడం లేదు. అందుకే దొరికిన వాళ్లతో ఎడ్జిస్ట్ అయిపోవాల్సివస్తోంది. శ్రుతి హాసన్ విషయంలోనూ అదే జరిగింది.