ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర చివరి దశకు వచ్చింది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట సమీపంలో ఆయన పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఇక, ప్రతీరోజూ ఆయన్ని వందల మంది కలుస్తున్నారనీ, కష్టాలు చెప్పుకుంటున్నారని ఆ పార్టీ పత్రిక యథావిధిగా పెద్దపెద్ద కథనాలు వేస్తూనే ఉంది. ఇవాళ్లి పత్రికలో కూడా ‘జన్మభూమి కమిటీ ఆగడాలు మితిమీరిపోయాయన్నా’ అంటూ ప్రజలు జగన్ కు ఫిర్యాదులు చేస్తున్నట్టు కథనంలో పేర్కొన్నారు. గ్రామాల్లో జన్మభూమి కమిటీవారి వేధింపులు భరించలేకపోతున్నామనీ, గడచిన నాలుగున్నరేళ్లుగా కష్టాలు పడుతున్నామనీ, సామాన్యుల్ని చాలా ఇబ్బందులుకు గురి చేస్తున్నారంటూ జగన్ ముందు కొందరు వాపోయినట్టు రాశారు.
పంట రుణాలు మొదలుకొని సంక్షేమ పథకాల అమలు వరకూ అన్నింటా లంచాలే అనీ, మంత్రి అచ్చెన్నాయుడు ఆగడాల నుంచి తమని రక్షించాలని జగన్ కి ప్రజలు ఫిర్యాదులు చేశారని చెప్పారు! మంత్రి ఆగడాల వల్ల ఊళ్లకు ఊళ్లూ ఖాళీ చేసే పరిస్థితి వచ్చిందనీ, తమని బెదిరిస్తున్నారంటూ మహిళలు జగన్ కి ఫిర్యాదు చేశారట. తిత్లీ తుఫాను సాయం కూడా తమకు అందలేదనీ, దాన్లో కూడా బోలెడు అవినీతి చోటు చేసుకుందనీ, కేంద్రం నిధులతో జరుగుతున్న పనుల్ని కూడా టీడీపీ వారికి మాత్రమే కంట్రాక్టులు ఇస్తున్నారంటూ కూడా ప్రజలు వాపోయారట. చివరిగా… మీరు ముఖ్యమంత్రి అయితే తప్ప మాకు మంచి రోజులు రావని ప్రజలు అంటున్నారని జగన్ ముందు ప్రజలు అభిప్రాయపడ్డట్టు ఆ కథనంలో పేర్కొన్నారు.
ఈరోజుదే కాదు, పాదయాత్ర మొదలుపెట్టిన దగ్గర్నుంచీ సాక్షి కవరేజ్ లో ఎక్కువగా ఈ తరహా కథనాలే కనబడుతూ వస్తున్నాయి. ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నట్టుగా, అధికార పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నట్టుగా చెప్పుకుని వస్తున్నారు. నాలుగున్నరేళ్లుగా ఇదే పరిస్థితి అంటూ రాస్తున్నారు. సరే… నాలుగున్నరేళ్లుగా ఇదే పరిస్థితి రాష్ట్రంలో ఉందీ, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారంటే… ఈ నాలుగున్నరేళ్లూ ఈ ప్రతిపక్ష నేత ఎక్కడున్నట్టు..? ప్రజల తరఫున మాట్లాడటమే కదా ప్రతిపక్ష పార్టీ పాత్ర? పాదయాత్ర చేస్తే తప్ప ప్రజల కష్టాలు ఆయనకి అర్థం కావడం లేదంటే… ప్రతిపక్ష నేతగా ఆయన ప్రజల తరఫున ఎప్పుడు నిలబడ్డట్టు..? ఎప్పుడు పోరాడినట్టు..? ప్రజల కష్టాలకు ఆయన ఇప్పుడు స్పందిచేస్తున్నారంటే… గడచిన నాలుగున్నరేళ్లుగా ప్రతిపక్ష నేతగా ఆయన విఫలమైనట్టా కాదా..? ప్రతిపక్ష నాయకుడి బాధ్యతల్నే సమర్థంగా నిర్వర్తించలేని జగన్ కి… అధికారం కట్టబెడితే ఏమౌతుందో అనే ఆలోచన ప్రజలకు ఉండదా..? ఎన్నికలు వస్తే తప్ప ప్రజల కష్టాలు గుర్తుకు రాని జగన్ ని… తమ నాయకుడిగా ఎన్నుకుంటే ఏం జరుగుతుందో అనే అంచనా దూరద్రుష్టి ప్రజలకు ఉండదా..?