ఆంధ్రప్రదేశ్ భాజపా అధ్యక్షుడు ఎవరనే అంశంపై చాన్నాళ్లుగా కొంతమంది పేర్లు తెరమీదికి వస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రమంత్రి పదవులకు అశోక్ జగపతిరాజు, సుజనా చౌదరి రాజీనామా చేసిన దగ్గర నుంచీ ఈ చర్చ మరింత ఎక్కువైంది. ప్రస్తుతం ఏపీ భాజపా అధ్యక్షుడిగా ఉన్న కంభంపాటి హరిబాబుకు కేంద్రమంత్రి ఇస్తారనీ, ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడుని నియమిస్తారనే ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో సోము వీర్రాజు, విష్ణుకుమార్ రాజు, ఆకుల సత్యనారాయణ పేర్లు తెరమీదికి వచ్చాయి.
అనూహ్యంగా ఓ నాలుగు రోజుల కిందట మాణిక్యాల రావు తెరమీదికి వచ్చింది. ఆయనకి ఏపీ పార్టీ బాధ్యతలు అప్పగిస్తారనీ, ఈ మేరకు సూత్రప్రాయంగా ఓ నిర్ణయం జరిగిపోయిందనే కథనాలూ మీడియాలోనూ ప్రముఖంగానే కనిపించాయి. అయితే, అసెంబ్లీ లాబీల్లో కొంతమంది అధికార పార్టీకి చెందిన నేతలతో ఆయన మాట్లాడుతూ… తనది దూకుడుగా మాట్లాడే స్వభావం కాదనీ, మిత్రపక్షంగా ఉన్నప్పట్నుంచీ సోము వీర్రాజు విమర్శలు చేస్తూ దూకుడుగా వెళ్తున్నారని మాణిక్యాలరావు వ్యాఖ్యానించారు. ఒక సామాజిక వర్గానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతాంశం చర్యకు వచ్చినప్పుడు తాను సోము వీర్రాజు పేరును ప్రతిపాదించారని ఆయన అన్నారు. పార్టీ అధ్యక్షుడిగా తనకు బాధ్యతలు ఇచ్చే కంటే, వీర్రాజుకు ఇవ్వడమే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇది మాణిక్యాలరావు సొంత అభిప్రాయంగా మాత్రమే చూడాలి. ఆయన ప్రతిపాదించిన మాత్రాన అధినాయకత్వం నిర్ణయం ఇలానే ఉంటుందనీ చెప్పలేం. నిజానికి, టీడీపీతో మిత్రపక్షంగా ఉన్నప్పటి దగ్గర్నుంచి కూడా వీర్రాజు టీడీపీపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఏపీ భాజపా నేతలకు ప్రాధాన్యత దక్కడం లేదన్న అక్కసుతో ఆయన అలా మాట్లాడేవారని గతంలో అనేవారు. ఓ దశలో ఏపీ భాజపా నేతల్ని అధిష్టానం పట్టించుకోవడం లేదన్న అసంతృప్తిని వ్యక్తీకరించేందుకే వీర్రాజు ఆ విధంగా వ్యవహరిస్తూ వచ్చారనీ అప్పట్లో కథనాలు వినిపించాయి. ఇప్పుడు, చంద్రబాబు సర్కారును లక్ష్యంగా చేసుకునే ప్రతీరోజూ విమర్శలు గుప్పిస్తున్నారు. నిజానికి, ఏపీ భాజపా అధ్యక్షుడిగా వీర్రాజును ఎంపిక చేయాలంటే.. ఆయనలో కనిపించే అర్హత ముఖ్యమంత్రి చంద్రబాబును మొదట్నుంచీ విమర్శించడం మాత్రమే..! కేవలం అదే ప్రాతిపదికగా పార్టీ బాధ్యతల్ని వీర్రాజు చేతిలో పెడతారా.. అనేది వేచి చూడాల్సిన అంశం.