స్పైడర్ సినిమాకి రూ.150 కోట్ల బడ్జెట్ అయ్యిందని స్వయంగా మహేష్ బాబే సెలవిచ్చాడు. తెలుగు, తమిళ భాషల్లో తీసిన సినిమాకాబట్టి, యాక్షన్ సన్నివేశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది కాబట్టి, పారితోషికాల పరంగానే సగం పోతుంది కాబట్టి.. రూ.150 కోట్ల బడ్జెట్ అవుతుందిలే అనుకొన్నారంతా. కానీ తెరపై ఆ హంగు, ఆర్భాటం కనిపించలేదు. సినిమాచూసిన వాళ్లంతా ‘రూ.150 కోట్లు ఎటుపోయాయ్’ అన్నట్టు సెటైర్లు వేసుకొంటున్నారు. ‘శివ సాఫ్ట్ వేర్ కనిపెట్టడానికే వంద కోట్లు తినేశాడేమో’ అనే పంచ్‌లూ ఫేస్బుక్కుల్లో పేలుతున్నాయి.
ఈ సినిమాలో ఎక్కువ భాగం ఇంటిలిజెన్స్ ఆఫీస్ నేపథ్యంలో నడుస్తుంది. ఆసెట్ కూడా భారీగా ఏం లేదు. మహేష్ ఇల్లు, పాటలు.. వీటికి సెట్లు వేయాల్సివచ్చింది. యాక్షన్ సన్నివేశాల గురించి చెప్పుకోవాల్సివస్తే బండరాయి సీను, క్లైమాక్స్ ఫైట్ తప్ప పెద్దగా ఖర్చయ్యే సమస్యే లేదు. సీజీ వర్క్‌కి భారీ ఎత్తున ఖర్చు పెట్టామని చెప్పలేరు. ఎందుకంటే.. ఆయా సన్నివేశాలు మరీ చీప్‌గా వచ్చాయి. ఈమాత్రం దానికే రూ.150 కోట్లు ఎలా అవుతాయి? అని లెక్కలుగడుతున్నారంతా.
మహేష్, మురుగదాస్ పారితోషికాలు కలిపితేనే రూ.50 కోట్లు దాటతాయి. సంతోష్ శివన్, హరీష్ జయరాజ్‌ల పారితోషికాలూ భారీగానే ఉంటాయి. ఎంత కాదన్నా పారితోషికాలకు రూ 60 కోట్ల వరకూ అవుతాయి. అంటే మేకింగ్‌కి 90 కోట్లు అయ్యాయన్నమాట. కాబట్టి… రూ.150 కోట్ల లెక్క.. కేవలం గాలి మాటలే. సినిమాని ఎక్కువ రేటుకి అమ్ముకోవడానికే ఈ కాకి లెక్కలన్నీ. మొత్తానికి రూ.150 కోట్ల పేరు చెప్పి నిర్మాతలు ఈసినిమాకి లాభాలకు అమ్ముకోగలిగారు.