అప్పుడెప్పుడో 8 ఏళ్ల క్రితం విడుదలైన సినిమా శ్రీమంతుడు. ఆ సినిమాపై అప్పట్లో పుట్టిన వివాదం ఇప్పటికీ సద్దుమణగలేదు. స్వాతి మైగజైన్లో శరత్ రాసిన కథనే కాపీ కొట్టి శ్రీమంతుడు సినిమా తీశారని అప్పట్లోనే ఆ రచయిత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. నాం పల్లి కోర్టు కొరటాలపై చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని ఆశ్రయించడం, ఆ తరవాత కొరటాల హైకోర్టుకు, ఆ తరవాత సుప్రీంకోర్టుకు వెళ్లడం, అక్కడ కూడా కొరటాల శివకు చుక్కెదురు అవ్వడంతో ఇక ఈ కేసుని కోర్టు బయట తేల్చుకోవాల్సిన అవసరం ఏర్పడ్డాయి.
శరత్‌కు ఎంతో కొంత ఇచ్చి, ఈ కేసు నుంచి బయటపడడమే కొరటాల ముందున్న మంచి మార్గం. అయితే అందుకు శరత్ కూడా ఒప్పుకోవడం లేదు. తనకు డబ్బులు వద్దని, క్రెడిట్ మాత్రం కావాలని ఆయన పట్టుబడుతుండడం విశేషం. అప్పట్లోనే రచయితల సంఘం ద్వారా కొరటాల శివ రూ.15 లక్షల పరిహారం ఇవ్వడానికి సిద్ధమయ్యారని, కానీ తనకు డబ్బులు తీసుకోవడంలో ఎలాంటి ఆసక్తి లేదని, ఆ కథ తనదే అని ఒప్పుకొంటే చాలని శరత్ వాదిస్తున్నారు. కానీ కొరటాల మనసు అందుకు అంగీకరించడం లేదు. క్రెడిట్ ఇస్తే, తనపై కాపీ ముద్ర పడుతుందని, తాను తప్పు చేసినట్టు అవుతుందన్నది కొరటాల ఫీలింగ్. డబ్బుల కోసం కాకుండా.. ఎప్పుడో వచ్చి, వెళ్లిపోయిన సినిమా క్రెడిట్ కోసం ఓ రచయిత ఇంతిలా కష్టపడుతున్నాడంటే.. ఆశ్చర్యమే.