సిద్ధాంతాల పునాదుల మీద మాట్లాడుకునే రాజకీయాలను వదలిపెట్టి.. మూస ఓటు బ్యాంకు రాజకీయాలకు భాజపా కూడా తెగబడుతుండడం ఇటీవలి పరిణామాల్లో జోరుగానే కనిపిస్తోంది. ఇప్పుడు కేరళలో మాజీ క్రికెటర్ శ్రీశాంత్‌ను పార్టీలో చేర్చుకోవడం, ఆయనకు అసెంబ్లీ స్థానం నుంచి టిక్కెట్ ఇవ్వడం కూడా అలాంటిదే! ఉడుమ నియోజకవర్గం నుంచి ఆయనను ఎంపికచేశారు. వచ్చేనెల 16న పోలింగ్ జరుగుతుంది.
కేరళ రాష్ట్రంలో భాజపాకు ఉన్న బలం నామమాత్రమే. ఈ నేపథ్యంలో శ్రీశాంత్‌ను చేర్చుకోవడం అనేది పార్టీకి ఎంతో కొంత లాభం అని వారు అనుకుంటున్నారు. పైకి యూత్‌ను టార్గెట్ చేసి శ్రీశాంత్‌ను తీసుకున్నట్లుగా చెబుతూనే ఉన్నారు గానీ.. వాస్తవంలో.. శ్రీశాంత్ కులాన్ని చూసే భాజపా చేర్చుకున్నదని అభిజ్ఞవర్గాల భోగట్టా. ఆయన కులానికి చెందిన బ్రాహ్మణవర్గీయుల ఓట్లు పడితే.. పార్టీకి లాభం అని వారు లెక్కలు వేస్తున్నారుట!
భాజపా ఆశలు ఎలాగైనా ఉండవచ్చు గాక.. మరి వాస్తవం ఎలా ఉంది? కేరళలో ఈసారి వామపక్షాల హవా స్పష్టంగా ఉన్నదని ఇప్పటికే సర్వే ఫలితాలు వస్తున్నాయి. వామపక్షాలు స్పష్టమైన మెజారిటీతో గద్దె ఎక్కుతారని ప్రచారం జరుగుతోంది. అలాంటి నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ బురద అంటించుకుని దేశవ్యాప్తంగా కేరళ రాష్ట్రం యొక్క పరువు తీశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీశాంత్ భాజపాకు బలంగా మారే చాన్సుందా అంటే అనుమానమే. శ్రీశాంత్ భాజపాకు బలం కావడం కంటె, ప్రత్యర్థి పార్టీలకు భాజపా మీద ఎక్కుపెట్టడానికి ఒక అస్త్రంగా ఉపయోగపడతాడని పలువురు అంటున్నారు. శ్రీశాంత్‌ను చేర్చుకోవడం భాజపా దిగజారుడు తనానికి నిదర్శనం అని ఇప్పటికే అక్కడ రాజకీయ ప్రత్యర్థులు దుమ్మెత్తిపోస్తున్నారు, భాజపా సమర్థించుకోవడానికి శ్రీశాంత్ ఏమీ కడిగిన ముత్యంలా బయటకు రాలేదు. పాపం.. శ్రీశాంత్ ద్వారా లేనిపోని చిక్కుల్ని భాజపా కొనితెచ్చుకున్నదేమో వచ్చేనెలలో తేలుతుంది.