ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత… ప్రారంభించి పూర్తి చేసిన మొట్టమొదటి ప్రాజెక్ట్ ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయం. దేశానికి సంబంధం లేకపోయినా… పార్టీ నిధులతో కట్టుకున్నా.. అటు ప్రధాని మోడీ, ఇటు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఫలితంగా… కేవలం పధ్నాలుగు అంటే .. పధ్నాలుగు నెలలకే పూర్తయింది. ఏడు అంతస్థుల్లో మూడు బ్లాక్లు, 70 గదులు, అధునాతన సదుపాయాలు, డిజిటల్ లైబ్రరీ ఇలా.. అన్నీ పధ్నాలుగు నెలలకే పూర్తయింది. ఇప్పుడు ఐక్యతా చిహ్నంగా ప్రచారం చేసేసి సర్దార్ పటేల్ ను బీజేపీకి ఆస్తిగా మార్చుకునేందుకు కట్టిన విగ్రహం కూడా..వేగంగానే పూర్తయింది. కానీ అది మోడీ ప్రధాని అయిన తర్వాతనే. ఈ విగ్రహాన్ని నిర్మించాలని గుజరాత్ ముఖ్యమంత్రిగా… తను పదేళ్లు పూర్తి చేసినప్పుడే..మోడీ నిర్ణయించారు. కానీ అడుగు ముందుకు పడలేదు. 2014లో మోడీ ప్రధాని కావడంతో.. ఆ ప్రాజెక్ట్ దశ మారిపోయింది. జాతీయ ప్రాజెక్టుగా మారిపోయింది. మోడీ ప్రభుత్వ తొలి బడ్జెట్ లోనే దాదాపుగా రూ. 2 వేల కోట్లు కేటాయించారు. సగం గుజరాత్ ప్రభుత్వం.. మిగతా సగం కేంద్రం ఇస్తోంది. ఆ తర్వాత ప్రాజెక్ట్ పరుగులు తీసింది. ఇప్పుడు ప్రారంభించేస్తున్నారు.
నిజానికి దేశంలో మరి ఏ అభివృద్ధి ప్రాజెక్ట్ కూడా ఇంత వేగంగా పూర్తి కాలేదు. అసలు దూరదృష్టితో ప్రారంభించిన ఒక్క ప్రాజెక్ట్ కూడా… కనీసం.. ప్రణాళికల వరకూ రాలేదు. దేశాన్ని ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నామని… ప్రధానమంత్రి నరేంద్రమోడీ చెబుతూ ఉంటారు కానీ.. అదంతా.. విగ్రహాల్లోనే ఉంది. ఆంధ్రప్రదేశ్ విషయంలోనే తీసుకుంటే…. జాతీయ విద్యాసంస్థలు నెలకొల్పడానికి కేంద్రం ఇస్తున్న నిధులు చూస్తే.. అసలు… 30 ఏళ్లలో కూడా పూర్తి కావు. వందల కోట్లు అవసరమైతే.. లక్షల్లోనే నిధులు ఇస్తోంది. ఇదే కాదు.. రాజధాని లేని ఓ రాష్ట్రానికి రాజధాని కట్టుకోవడానికి .. అదీ చట్టంలో ఉన్నప్పటికీ.. సాయం చేయడానికి ప్రధానికి చేతులు రాలేదు. నిజానికి.. ఓ రాష్ట్రం అభివృద్ధి చెందితే.. మొదటగా లాభపడేది కేంద్రమే. అయినా సరే.. ప్రధానమంత్రి తనకు రాష్ట్రాల కన్నా.. విగ్రహాలే ముఖ్యమనుకున్నారు. ఒక్క ఏపీ అని మాత్రమే కాదు.. బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో కనీసం శంకుస్థాపన చేసిన జాతీయ ప్రాజెక్ట్ కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. పోనీ… ఈ విగ్రహం వల్ల.. గుజరాత్ ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా అంటే అదీ లేదు. బడుగుల బతుకులను చదును చేసి పడేసి మరీ ఈ విగ్రహాన్ని నిర్మించారు. స్టాట్యూ ఆఫ్ యూనిటీ నిర్మాణంతో సుమారు డెబ్భై గిరిజన గ్రామాలు మునుగుతున్నాయి. వీరందరికీ పునరావాసం కల్పించలేదు. అందిరికీ పునరావాసం పూర్తి చేసిన తర్వాత విగ్రహం ఆవిష్కరిస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ.. ముంపు గ్రామాల గిరిజనులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. గిరిజనులకు ఇస్తామన్నా ఇళ్లు గానీ, ఉద్యోగాలు గానీ ఇవ్వలేదు. దీంతో ఆ ప్రాంతంలోని గిరిజనులు ఉద్యమాలు చేస్తున్నారు. స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఆవిష్కరణకు రావొద్దంటూ 22 గ్రామాల సర్పంచ్లు సంతకాలు చేసి మోడీకి పంపారు. ఇళ్లపై నల్లజెండాలు ఎగురవేసి తమన నిరసనలు తెలియజేస్తున్నారు. బాధితులు ఈ రోజు సంతాప దినాన్ని పాటిస్తున్నారు.
స్టాట్యూ ఆఫ్ యూనిటీ కోసం దాదాపుగా రూ. మూడున్నర వేల కోట్లు ఖర్చు పెట్టారు. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి ఇది చాలా పెద్ద బడ్జెట్. ఈ మొత్తంతో ఓ చిన్న స్థాయి సాగునీటి ప్రాజెక్ట్ కట్టొచ్చు. గుజరాత్లో అనేక ప్రాంతాలు తాగునీటికి కటకట. ఆయా ప్రాంతాల కోసం భారీ వాటర్ ప్లాంట్లు స్థాపించొచ్చు. కనీసం నర్మదా నదీ తీర ప్రాంతంలో గిరిజన యువత ఉపాధికి కేటాయిస్తే… ఆ ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. కానీ మోడీ… చెప్పే అభివృద్ధి .. అభివృద్ధి మోడల్.. అంతా.. భావోద్వేగ అంశాలతో ముడిపడి ఉంటుంది. బతుకులు బాగుచేయడంలో ఉండదు.