బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక కూడా కేసీఆర్ ఫ్యామిలీపై కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శల జడివాన ఆపడంలేదు. గతానికి మించి విమర్శల్లో డోస్ పెంచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే బీఆర్ఎస్ నూ టార్గెట్ చేయడం వెనక బండి వ్యూహం ఏమై ఉంటుంది అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
సాధారణంగా అధికార పార్టీపై ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు మూకుమ్మడిగా విమర్శల దాడి చేస్తుంటారు. తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా సీన్ కనిపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధికార పార్టీపై దూకుడుగా విమర్శలు, ఆరోపణలు చేస్తుండగా..బీజేపీ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ మాత్రం కాంగ్రెస్ ను కార్నర్ చేస్తూనే కేసీఆర్ ఫ్యామిలీపై కన్నెర్ర జేస్తున్నారు.
విషయం ఏదైనా కాంగ్రెస్ తో సమానంగా బీఆర్ఎస్ ను వాయించేస్తున్నారు. దీంతో బండి సంజయ్ ఎందుకు బీఆర్ఎస్, కేసీఆర్ ఫ్యామిలీని అధికంగా ఇంకా టార్గెట్ చేస్తున్నారు అనే పశ్నలు సహజంగానే తలెత్తుతున్నాయి.
బీజేపీతో బీఆర్ఎస్ కు ఒప్పందం కుదిరిందని ప్రచారం నేపథ్యంలో ఈ ప్రచారానికి బ్రేకులు వేయడంతోపాటు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్లేసును బీజేపీ ఆక్రమించే వ్యూహంతో బండి ఈ కామెంట్స్ చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.