ఆంధ్రజ్యోతిపై రూ. వంద కోట్ల పరువు నష్టం కేసులో పిటిషన్ వేసేందుకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి తిరుపతి వచ్చి.. పత్రాలపై సంతకాలు పెట్టి.. ఆ తర్వాత సీఎం జగన్‌తో విందు భేటీ నిర్వహించిన సుబ్రహ్మణ్యస్వామి న్యాయప్రక్రియలో మాత్రం లైట్ తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు వాయిదాలు కోరుతున్నారు. ఏ సారి ఆస్పత్రిలో ఉన్నానని.. మరోసారి సమాచారం సేకరిస్తున్నానని చెప్పి.. వారాలకు వారాలు వాయిదా కోరుతున్నారు. ఆంధ్రజ్యోతిపై దాఖలైన కేసులో పోలీసులు చురుగ్గా దర్యాప్తు చేయడం లేదని.. ఓ పిల్‌ను హైకోర్టులో వేశారు. ఈ పిల్ విచారణలో అసలు హైకోర్టు నోటీసులు జారీ చేయకుండానే… పోలీసులు కౌంటర్ వేశారు.
దీనిపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. విచారణలో పోలీసులు కౌంటర్ వేశారని.. దాన్ని తాము సుబ్రహ్మణ్యస్వామికి కూడా ఇచ్చామని ప్రభుత్వ న్యాయవాది చెప్పుకొచ్చారు. దానిపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అసలు నోటీసులు జారీ చేయకుండా కౌంటర్ దాఖలు చేయడం ఏమిటని ఆశ్చర్యపోయింది. అదే సమయంలో.. సుబ్రహ్మణ్యస్వామి తరపులాయర్ ఆ కౌంటర్ తరపున రిజాయిండర్ దాఖలు చేస్తామని చెప్పుకొచ్చారు. ఇంతా చేసి తిరుపతి పోలీసులు తమ కౌంటర్లో.. ఆంధ్రజ్యోతి పత్రిక తప్పు చేసిందని కానీ.. మరొకటని కానీ చెప్పలేదు. టీటీడీ వెబ్ సైట్ ఆధారంగానే కథనం రాశామని పత్రిక ప్రతినిధులు చెప్పారని.. టీటీడీ ఐటీ విభాగం..ఫోరెన్సిక్ ల్యాబ్ సహా ఇతర మార్గాల నుంచి సమాచారం సేకరిస్తున్నామని.. స్వామి పిటిషన్ కొట్టి వేయాలని సూచించారు.
పత్రికదే తప్పని పోలీసులు కౌంటర్ వేస్తే.. దాని ఆధారంగా పరువు నష్టం కేసును మరింత ముందుకు తీసుకెళ్లాలని అనుకున్నారేమోకానీ.. ఇప్పుడు మాత్రం స్లో అయ్యారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆంధ్రజ్యోతి ఆర్కేపై గురి పెట్టి… ప్రత్యేక విమానంలో రప్పించిన పాలకులు …తర్వాత నాలిక్కరుచుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన ఆర్కేపై నేరుగా విమర్శలు చేయడంతో… తాను కూడా పరువునష్టం వేయబోతున్నానని ఆర్కే సవాల్ చేశారు. అప్పట్నుంచి ఈ కేసులో సుబ్రహ్మణ్యస్వామి యాక్టివ్‌గా లేరు… ఆర్కే కూడా స్వామిపై పరువు నష్టం కేసు వేయలేదు.