బుల్లి తెరపై జబర్దస్త్ ఓ సంచనలం. ఈటీవీకి ఏళ్లతరబడి అత్యధిక టీఆర్పీలు కట్టబెడుతున్న పోగ్రాం ఇది. ఈ షోతోనే చాలామంది కమెడియన్లు వెలుగులోకి వచ్చారు. అందులో చాలామంది సెలబ్రెటీలు అయిపోయారు. ఆ తరవాత సినిమా అవకాశాలు రావడం మామూలే. తొమ్మిదేళ్లుగా ఓ షో.. ఇంత మంచి రేటింగులతో కొనసాగడం తెలుగులో ఇదే తొలిసారేమో.? అయితే కొంతకాలంగా జబర్దస్త్ కామెడీ అంతగా పండడం లేదు. రొటీన్ స్కిట్లతో విసిగెత్తిస్తున్నారు. దానికి తోడు వివాదాలొకటి. దాంతో… రేటింగులు పడడం మొదలయ్యాయి. టీవీలో చూడడం కంటే, యూ ట్యూబుల్లో బిట్లు బిట్లుగా చూడడం ఎక్కువైంది. ఇప్పుడు జబర్దస్త్‌కి మరో షాక్. ఈ షో నుంచి సుడిగాలి సుధీర్ బయటకు వచ్చేసినట్టు టాక్. సుధీర్ వచ్చేస్తే… రామ్ ప్రసాద్, గెటప్ శ్రీనులు కూడా ఈ షో నుంచి బయటకు వెళ్లిపోదామని అనుకుంటున్నార్ట. వీళ్లదంతా ఒకేబ్యాచ్ కాబట్టి.. ఈ గ్యాంగ్ లేకపోతే… జబర్దస్త్ పరిస్థితి మరింత దారుణంగా పడిపోయే అవకాశం ఉంది.
ప్రతీ యేటా.. ఆర్టిస్టులతో ఎగ్రిమెంట్లు చేయించుకుంటుంది మల్లెమాల. అయితే ఈ యేడాది కొత్తగా ఎగ్రిమెంట్లపై సంతకాలు చేయడానికి సుడిగాలి సుధీర్ అంగీకరించలేదట. ఇది వరకు వీళ్లందరికీ జబర్దస్త్ ఒక్కటే షో. ఇప్పుడు అలాకాదు. వీళ్ల చేతిలో చాలా షోలు ఉన్నాయి. దానికి తోడు.. సినిమాల నుంచి కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇటీవల సుడిగాలి సుధీర్ హీరోగా ఓ సినిమా మొదలైంది. మరోటి ప్రీ ప్రొడక్షన్ లోఉంది. వాటి వల్ల జబర్దస్త్ కి టైమ్ కేటాయించడం వీలవ్వడం లేదని, అందుకే ఈ షో చేయడం కుదడం లేదని సుధీర్ చెప్పాడట. మల్లెమాల దగ్గర కూడా సుధీర్ ని అడ్డుకునే కారణాలు. మంత్రాలూ ఏవీ లేవు. సో… జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ చాప్టర్ దాదాపుగా ముగిసినట్టే.