ఫీల్ మై లవ్ అంటూ ఆర్య సినిమాలో అల్లు అర్జున్ చేత అల్లరి పెట్టించిన డైరక్టర్ సుకుమార్.. ఆ సినిమాతోనే ప్రేమని ఎక్స్ ప్రెస్ చేసే విధానంలో కొత్త కోణాన్ని చూపించి సూపర్ హిట్ కొట్టాడు. ఆర్య నుండి 1 నేనొక్కడినే వరకు సుక్కు తీసిన సినిమాలు హిట్టా కాదా అన్నది పక్కన పెడితే సినిమాలో విషయం మాత్రం బాగా ఉంటుంది. అయితే అది అర్ధమైన వారికి సినిమా బాగా నచ్చుతుంది కాని సుకుమార్ సినిమాలను అర్ధం చేసుకునే వారు ఎంతమందో ఆయనకే తెలియాలి. ఇక సుకుమార్ సరికొత్తగా నిర్మాతగా అవతరించడం కుమారి21ఎఫ్ సినిమాకు కథ – స్క్రీన్ ప్లే అందించడం జరిగింది.
తన దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్న సూర్య ప్రతాప్ ని డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేయించి కుమారిని తెరకెక్కించాడు సుకుమార్. సినిమా నిన్న రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. యూత్ ని ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉన్నా సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ మాత్రం ఛీ అనేస్తున్నారు. మొన్నటిదాకా మారుతి ఇలాంటి సినిమాలనే తీసి చెడ్డ పేరు తెచ్చుకుంటే మంచి పేరు ఉన్న సుక్కు ఇలాంటి ప్రయత్నం చేయడమేంటని అందరు ఆశ్చర్యపోతున్నారు.
అయితే ఫ్యామిలీ ఆడియెన్స్ తాకిడికి మారుతి కూడా తన పంథా మార్చుకుని భలే భలే మగాడివోయ్ లాంటి క్లీన్ యు సర్టిఫికేట్ సినిమా తీస్తే సుకుమార్ ఎందుకు ఇలా చేశాడని ఆడియెన్స్ బుర్ర ఆలోచనతో వేడెక్కిపోతుంది. సుకుమార్ నుండి ఎవరు ఎక్స్ పెక్ట్ చేయని ఈ లవ్ స్టోరీ కుర్రకారు కేక అనేస్తున్నా.. ఇన్నాళ్లు ఎంతో కష్టపడి సుకుమార్ సంపాధించుకున్న క్రేజ్ మాత్రం ఈ సినిమాతో పోగొట్టుకున్నాడనే టాక్ వినిపిస్తుంది. అంతేకాదు చూస్తుంటే ఎన్.టి.ఆర్ తో తీసే నాన్నకు ప్రేమతో కూడా కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్నాయని కంగారు పెడుతున్నాడు. అందుకే కుమారి ప్రభావం నాన్నకు ప్రేమతో మీద పడే చాన్స్ కూడా ఉందని టెన్షన్ పడుతున్నారు ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్.