మొత్తానికి అఖిల్ కష్టం వృథా అయ్యింది. ఏజెంట్ డిజాస్టర్ లిస్టులోకి చేరిపోయింది. అయితే… అఖిల్ నటించిన గత సినిమాలు ఫ్లాప్ అయినా, ఇంత నష్టం, ఇంత ట్రోలింగ్ కనిపించలేదు. ఈసారి అఖిల్ కెరీర్‌కే రెడ్ సిగ్నల్ పడేంత.. ఫ్లాప్ వచ్చింది. ఇదంతా.. సురేందర్ రెడ్డి పుణ్యమే అనేది ఇండస్ట్రీ వర్గాల మాట.
సురేందర్ రెడ్డి మంచి టెక్నీషియన్. స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేస్తాడు. ఏజెంట్ లాంటి కథలకు కావాల్సిందే అది. సురేందర్ రెడ్డి ఏజెంట్ లాంటి సినిమా తీస్తున్నాడని తెలియగానే, ట్విస్టులు టర్న్‌లు ఆశిస్తారు. అవేమీ ఈ కథలో కనిపించలేదు. కథ కూడా పేలవంగా సాగింది. అసలు ఇలాంటి కథతో.. సురేందర్ రెడ్డి నిర్మాతనీ, హీరోనీ ఎలా నమ్మించాడా? అనేది పెద్ద అనుమానం.
కథ పోయింది.. పోనీ కాస్టింగ్? ఆ విలన్ పాత్రధారిని ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చారో కానీ పూర్తిగా మిస్ మ్యాచింగ్. హీరోయిన్ కూడా అఖిల్ కి అక్కలా ఉంది. అసలు ట్రాకే.. చిరాకు పుట్టించింది. తొలి సినిమా తీస్తున్నప్పుడు దర్శకుడు తడబడి… గజిబిజి అయిపోతాడే, అలా తీశాడు సూరి ఈ సినిమాని.
ఇదంతా ఒక ఎత్తయితే, రీషూట్లు మరో ఎత్తు. ఈమధ్య కాలంలో ఏజెంట్ సినిమాకి జరిగినన్ని రీషూట్లు మరో సినిమాకి జరగలేదన్నది ఇండస్ట్రీ వర్గాల టాక్. సినిమా పూర్తయి, ఫస్ట్ కాపీ వచ్చాక కూడా `మరో పది రోజులు టైమ్ ఇస్తే రీషూట్లు చేస్తా` అని సూరి నిర్మాతతో చెప్పాడని టాక్. ఎడిటింగ్, ఫైనల్ మిక్సింగ్.. ఇవేం సూరి పట్టించుకోలేదని, అసిస్టెంట్లపై వదిలేశాడని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతే కాదు.. సెట్లో సహాయకులపై సూరి దురుసుగా ప్రవర్తించేవాడని, ఈ సినిమా జరుగుతున్నన్ని రోజులూ… అసిస్టెంట్ డైరెక్టర్లు మారుతూనే ఉన్నారని, సెట్లో ఆరోగ్యకరమైన వాతావరణం కనిపించలేదని చెబుతున్నారంతా.
దర్శకుడు చేసింది తప్పే. కానీ… హీరోగా అఖిల్ విచక్షణ ఏమైంది? తనకు ఏమాత్రం సూటవ్వని కథని ఎలా ఎంచుకొన్నాడు? ఇన్ని సినిమాలు తీసిన నిర్మాత అనిల్ సుంకర తెలివితేటలు ఏమయ్యాయి? కర్ణుడి చావుకి వంద కారణాలున్నట్టు.. ఇలాంటి ఫ్లాపు సినిమాలకు కూడా అన్నే కారణాలు కనిపిస్తాయి. కానీ వేళ్లన్నీ దర్శకుడి వైపే చూపిస్తాయి. అలా ఇప్పుడు నిందలన్నీ సూరి మోస్తున్నాడు.