తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల పద్ధతేంటో, వ్యూహమేంటో, విధానాలేంటో వారికైనా అర్థం అవుతున్నట్టు లేదు..! హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఆ పార్టీకి ఇజ్జత్ కా సవాల్. ఎందుకంటే, అది పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వస్థానం. ఇప్పుడక్కడ ఉత్తమ్ భార్య పద్మావతిని ఓడించడం కోసం ఆరేళ్లుగా కమ్యూనిష్టులను విమర్శలతో కడిగిపారేసి సీఎం కేసీఆర్ కూడా వాళ్లని దగ్గరకి చేర్చుకుని మద్దతు తీసుకుంటున్నారు. నిజానికి, తెరాస ఓడితే పెద్ద ఫరక్ పడదు. కానీ, కాంగ్రెస్ ఓడితే ఆ పార్టీకి ఇంకా ఇబ్బందే. ఇలాంటప్పుడు కాంగ్రెస్ వ్యూహం ఎంత పక్కగా ఉండాలి..? కానీ, ఆ పార్టీ నేతలు ఎవరికివారే అన్నట్టుగా… మద్దతు కూడగట్టే ప్రయత్నం పేరుతో బలహీనతను బలంగా చాటుకునేట్టు వ్యవహరిస్తున్నారు. సీనియర్ నేత వీ హన్మంతరావు జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లారు!
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో తమ అభ్యర్థి పద్మావతికి మద్దతు ఇవ్వాలంటూ ఓ వినతి పత్రాన్ని వీహెచ్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం కేరళలో ఉన్నారు. వెన్నునొప్పికి ఆయుర్వేద చికిత్స చేయించుకోవడం కోసం వెళ్లినట్టు సమాచారం. కాబట్టి, వీహెచ్ వినతిపై పవన్ కల్యాణ్ అధికారికంగా ఇంకా స్పందించాల్సి ఉంది. అయితే, ఉప ఎన్నికలో కాంగ్రెస్ కి మద్దతు పవన్ కల్యాణ్ ఇస్తారా అనేదే ప్రశ్న.? మొన్నటి నల్లమల అంశం వేరు… కాంగ్రెస్ అభ్యర్థికి ఉప ఎన్నికల్లో మద్దతు ఇవ్వడం వేరు. ఆ పనిచేస్తే పవన్ కల్యాణ్ మీద కాంగ్రెస్ అనుకూలవాది ముద్ర పడిపోతుంది. కాబట్టి, ఆయన మౌనంగానే ఉంటారనేది కొందరి అభిప్రాయం. మరి, ఏ నమ్మకంతో వీహెచ్ వెళ్లినట్టు అంటే…. ఈ మధ్యనే యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమిద్దామంటూ పవన్ దగ్గరకి ఆయన వెళ్లాగానే, పవన్ కూడా సరే అన్నారు. దాంతో ఒక్కసారిగా సేవ్ నల్లమల ఉద్యమానికి ఊపు వచ్చింది. ఆ లెక్కన తాను కోరితే పవన్ కాదనరనే లెక్కల్లో వీహెచ్ వెళ్లుంటారు!
పవన్ మద్దతు వీహెచ్ కోరడం వరకూ తప్పులేదు… కానీ, దీన్ని అధికార పార్టీ తెరాస మాంచి విమర్శనాస్త్రంగా వాడుకుంటుంది. సొంతంగా గెలిచే సత్తా లేదని ప్రచారం చేసుకుంటుంది. టి. కాంగ్రెస్ లో హేమాహేమీలు ఉండగా… మరో పార్టీ నాయకుడి మద్దతు కోసం ఎందుకు చూస్తున్నారని అంటుంది. నిజానికి, ఈ మధ్య టి. కాంగ్రెస్ కి పవన్ జపం ఎక్కువైపోయింది. ఓరకంగా జనసేనకు ఇది కలిసి వచ్చే అంశంగా ఉపయోగపడుతుందిగానీ, కాంగ్రెస్ ఏరకంగా చూసుకున్నా ఈ ధోరణి మైనస్సే.