తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ను తొలగించిన సంగతి తెలిసిందే. వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయాలన్న వ్యూహంలో భాగంగానే పార్టీ హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుందనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే, దిగిజ్వయ్ బాధ్యత తొలగింపు వెనక తెలంగాణ కాంగ్రెస్ లోని ఒక వర్గం తీవ్ర ప్రయత్నం ఉందనే చర్చ ఇప్పుడు పార్టీ వర్గాల్లో వాడీవేడిగా వినిపిస్తోంది. డిగ్గీని తప్పించడం వెనక పీసీసీకి చెందిన ఒక ప్రముఖ నాయకుడి హస్తం ఉందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఢిల్లీ స్థాయిలో ఆ ముఖ్యనేత పావులు కదిపారనీ, కాంగ్రెస్ లోనే వైరి వర్గాన్ని డిగ్గీరాజా పెంచి పోషిస్తున్నారనే ఫిర్యాదులను పార్టీ అధిష్టానానికి ఆయనే చేరవేశారనే చర్చ శ్రేణుల్లో ఇప్పుడు వినిపిస్తోంది. అయితే, ఇదంతా ముగిసిపోయిన తతంగం కదా.. దీని గురించి మాట్లాడుకుంటే ఏం ప్రయోజనం అనేగా అనుమానం..? బాధ్యతల నుంచి తప్పుకున్న డిగ్గీరాజా ఇప్పుడు టి నేతల వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట!
దిగ్విజయ్ తొలగింపు కారణమైన ఆ ముఖ్యనేత వ్యవహారాన్ని కాంగ్రెస్ లోని మరో వర్గం అనుకూలంగా మార్చుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది అంటున్నారు. దీన్లో భాగంగానే డిగ్గీరాజా తొలగింపునకు కారణమైన అంశాలను ఒక్కోటిగా సేకరించి, ఆయన ముందుంచారట. తమ తొలగింపు వెనక ఇదిగో ఈ స్థాయి రాజకీయం జరిగిందని దిగ్విజయ్ సింగ్ కు నివేదించడంతో… ఆయన ఆగ్రహించారని సమాచారం. అనుభవం ఉన్న నేత అని కూడా చూడకుండా తమపై సోనియాకు ఫిర్యాదులు చేశారని దిగ్విజయ్ కు చెప్పి… రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకునేలా కృషి చేయాలని కొంతమంది రాష్ట్ర నేతలు కోరినట్టు వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు దిగ్విజయ్ కూడా ఆ వర్గంపై అసంతృప్తి పెంచుకుంటున్నారనీ, మరో వర్గానికి అనుకూలంగా హైకమాండ్ దగ్గర పావులు కదిపి, వారికి మేలు చేయాలని చూస్తున్నట్టు చెబుతున్నారు.
దిగ్విజయ్ సింగ్ కు జరిగింది అవమానమని భావిస్తున్నారు కాబట్టి, దీనికి బదులుగా తెలంగాణ పీసీసీలో మార్పులు ఉండే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఆ మార్పులలో భాగంగా ఎవరెవరికి ఏయే బాధ్యతలు అప్పగించాలనే అంశంపై కూడా డిగ్గీరాజా ఓ జాబితా సిద్ధం చేసుకున్నారనీ, త్వరలోనే ఆయన వ్యూహరచన అమల్లోకి వస్తుందని అంటున్నారు. మొత్తానికి, కాంగ్రెస్ లో మరోసారి గ్రూపు రాజకీయాలు రాజుకుంటున్నాయి. పార్టీ నేతలందరూ కలిసికట్టుగా తెరాసను ఎలా ఎదుర్కోవాలనే వ్యూహ రచన చేయాల్సిన తరుణంలో… పదవులూ ఒకరినినొకరు దెబ్బ తీసుకునే వ్యూహాలతో తలమునకలై ఉంటే.. కిందిస్థాయి కేడర్ కు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నట్టు.? కాంగ్రెస్ పార్టీ చిత్తుశుద్ధిపై ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు పంపుతున్నట్టు..?