తమిళ చిత్ర సీమలో విశాల్ రెబల్‌గా మారారు. పాతుకు పోయిన వారిని పెకిలించి నడిగర్ సంఘంతో పాటు నిర్మాతల మండలి అధ్యక్ష స్థానాన్ని కూడా గెల్చుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి తిరగబడింది. ఆయనపై వ్యతిరేకత పెరుగుతోంది. ఒకప్పుడు ఆయనకు జై కొట్టినవారు ఇప్పుడు మద్దతుగా ముందుకు వచ్చేందుకు సిద్ధంగా లేరు. 2017లో విశాల్ టీఎన్ఎఫ్పీసీ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు ఆర్కే సురేశ్, ఉదయ అనే ఇద్దరు నిర్మాతలు మద్దతుగా నిలిచారు. ఈ ఇద్దరూ విశాల్‌కు స్నేహితులు. ఇప్పుడు వీరే విశాల్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ముందు నుంచీ విశాల్ పై కొంత మంది నిర్మాతలు అసంతృప్తిగా ఉన్నారు. కారణాలేవైనా కానీ.. వారు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా.. అని ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి ఇప్పుడు ఒకేసారి 9 సినిమాల విడుదల కలసి వచ్చింది.
సినిమాల విడుదలను క్రమబద్ధీకరించడం కోసం టీఎన్ఎఫ్పీసీ ఓ కమిటీని వేసింది. ఈ కమిటీ సూచనల ప్రకారమే.. సినిమాలు విడుదలవుతున్నాయి. అయితే ఈ కమిటీ పక్షపాతంగా వ్యవహరిస్తోందనేది కొందరు నిర్మాతల ఆరోపణ. ఒకేసారి తొమ్మిది సినిమాల విడుదలకు నిర్మాతల మండలి ఓకే చెప్పడం ఏమిటన్నది నిర్మాతల అభ్యంతరం. దీన్ని పట్టుకుని విశాల్‌కు వ్యతిరేకంగా పెద్ద రగడే సృష్టిస్తున్నారు. ప్రస్తుత కార్యవర్గాన్ని రద్దు చేసి, మళ్లీ ఎన్నిక జరపాలనే డిమాండ్లను బలంగా వినిపిస్తున్నాయి. పైగా విశాల్… నిర్మాతల మండలి అధ్యక్షునిగా కొన్ని కొత్త కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చితికిపోయిన నిర్మాతలకు సాయం చేసేందుకు ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. ఇలా.. ఇళయరాజాతో ఓ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఆ ఈవెంట్ జరగకుండానే.. ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. విశాల్ కూడా అదే చెబుతున్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఈవెంట్ నిర్వహిస్తానంటున్నారు.
అసలు ఈ వివాదం అంతటికి మూలకారణం విశాల్ తమిళ రాజకీయాల్లో వేలు పెట్టడమే కారణమని కొంత మంది చెబుతున్నారు. ఆర్కేనగర్ ఉపఎన్నిక సమయంలో.. విశాల్ దినకరన్ వైపు మొగ్గు చూపారు. దినకరన్‌ను పోటీకి అనర్హుడ్ని చేస్తే.. తాను పోటీకి దిగాలనుకున్నారు. నామినేషన్ కూడా వేశారు. కానీ ఆ అవసరం రాలేదు. అయితే.. రాజకీయ కోణంలోనే.. విశాల్ ను టార్గెట్ చేశారనడానికి చాలా కారణాలు బయటకు వస్తున్నాయి. విశాల్‌ను ఎలాగైనా పదవి నుంచి దించేందుకు… తీవ్రమైన ఆరోపణలే చేస్తున్నారు. పైరసీ సినిమాల వెబ్సైట్ తమిళ రాకర్స్‌లో విశాల్‌కు వాటా ఉందని కూడా ఆరోపిస్తున్నారు. మొత్తానికి విశాల్ వీటన్నింటినీ ఎదుర్కోగల శక్తి ఉన్నవాడే. కానీ రాజకీయం టార్గెట్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం..!