తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాజకీయ సమీకరణాల్లో చాలా పక్కాగా ఉంటారు. కాంగ్రెస్ పార్టీతో బంధం విషయంలోనూ.. ఆయన అదే పంథాలో ఉన్నారన్నదానికి స్పష్టమైన సూచనలు బయటకు వస్తున్నాయి. ఢిల్లీలో రాహుల్ గాంధీతో చంద్రబాబు భేటీ తర్వాత.. ఏపీలో ఆ పార్టీతో పొత్తు ఖరారయిందన్నట్లుగా.. కొంత మంది ప్రచారం చేస్తూండటాన్ని… తిప్పికొట్టాలని… టీడీపీ అధినేత తన పార్టీ నేతలకు స్పష్టమైన సూచనలు సంపించారు. ఏపీలో పొత్తుల ప్రస్తావన లేదని… కేవలం జాతీయ స్థాయిలో కూటమి విషయంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయబోతున్నామని చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంపై.. పార్టీ అంతర్గత సమావేశాల్లో … టీడీపీ నేతలకు స్పష్టమైన విధానాన్ని ప్రకటిస్తున్నారు.
భారతీయ జనతా పార్టీని ఢిల్లీలో మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడమే చంద్రబాబు లక్ష్యం. దాని కోసం.. ప్రాంతీయ పార్టీల కూటమి పెట్టినా ప్రజల్లో విశ్వాసం కలగదని అంచనాకు వచ్చారు. ఓ వైపు.. బీజేపీ… మరో వైపు … కాంగ్రెస్తో కూడిన కూటమి ఉంటేనే.. ప్రత్యామ్నాయంగా ప్రజలు ఓ అంచనాకు వస్తారని నమ్మారు. తెలంగాణలో.. తిరుగులేని విధంగా ఉన్న కేసీఆర్కు.. పోటీ ఇచ్చే నాయకుడు ఎవరూ లేరు. అయినప్పటికీ.. మహాకూటమిగా ఏర్పడిన తర్వాత.. అక్కడి రాజకీయ పరిస్థితుల్లో అనూహ్యమైన మార్పులొచ్చాయి. ఇదే ఫార్ములా దేశం మొత్తం అమలు చేస్తున్నారు చంద్రబాబు. ప్రధానమంత్రి అభ్యర్థి అనే మాట రాకుండా.. ముందుగా.. మోడీని ఎదుర్కోవడానికి దేశం మొత్తం ఏకం అయిందనే భావన తెప్పించడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగానే… రాహుల్ గాంధీని కలిశారు. చర్చించారు. తాను అనుకున్న ఎఫెక్ట్ను కొంత మేర సాధించగలిగారు.
అయితే… ఆ తర్వాత అనూహ్యంగా ఏపీలో.. కాంగ్రెస్ పార్టీతో సీట్ల సర్దుబాటు ఉంటుందనే ప్రచారాన్ని కొంత మంది ప్రారంభించారు. ఈ విషయంలో ముందుగానే చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. జాతీయ స్థాయిలో బీజేపీని గద్దె దించడానికి కలసి పని చేస్తాం కానీ.. ఏపీలో పొత్తుల గురించి కానీ…. తెలంగాణలో సీట్ల సర్దుబాటు గురించి కానీ చర్చించలేదని… చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు. దీంతో.. టీడీపీ నేతల్లో క్లారిటీ వస్తుంది. కాంగ్రెస్ పార్టీతో సీట్ల సర్దుబాటు అనే అంశంమే ఉండదని చెబుతున్నారు. అయితే… కాంగ్రెస్ పార్టీ జాతీయ స్తాయిలో ఇస్తున్న రూ. 2లక్షల రుణమాఫీ, ప్రత్యేకహోదా అంశాలు ప్రజల్లోకి బాగా వెళితే.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో.. కాంగ్రెస్ పార్టీ ఘన విజయాలు సాధిస్తే మాత్రం… పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది.