అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి అనే అంశంపై అసెంబ్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు చర్చిస్తున్న సమయంలోనే ఒక అగ్రిగోల్డ్ బాధితుడు గుండెపోటుతో చనిపోయాడు. తనకు న్యాయం జరగదు అన్న ఆవేధన, ఆందోళనల నేపథ్యంలోనే గుండె ఆగిచనిపోయాడని బంధువులు చెప్తున్నారు. అంటే బాధితులకు ధైర్యం ఇవ్వడంలో మన ప్రజాప్రతినిధులు ఏం విజయం సాధించినట్టు? మరీ ముఖ్యంగా ఈ విషయంలో టిడిపి ప్రభుత్వం అయితే మాత్రం ప్రత్యేక హోదా సమయంలో వ్యవహరించినట్టుగానే వ్యవహరిస్తోంది. కచ్చితమైన సమాచరం మాత్రం అస్సలు ఇవ్వరు. న్యాయం చేస్తాం చేస్తాం అని మాటల గారడీ చేస్తున్నారు. అగ్రిగోల్డ్ ఇష్యూపై చర్చ నడుస్తున్న సమయంలో ఎప్పుడో జరిగిపోయిన స్పీకర్ మాటల ఇష్యూ ఎందుకు చర్చలోకి వచ్చిందో తెలుసుకోలేనంత అమాయకులు ఎవరైనా ఉన్నారా? కనీసం బాధితుల పక్షాన మాట్లాడడమే ఇష్టం లేనివాళ్ళకు….ఆ బాధితులకు న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి ఉందని ఎలా నమ్మాలి?
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి ప్రభుత్వం ఎన్నేళ్ళుగా చెప్తోంది. భూముల కొనుగోలు విషయంపై గతంలోనే పత్తిపాటి పుల్లారావు మీడియా సాక్షిగా ఒప్పుకున్న విషయం నిజం కాదా? మరి మళ్ళీ ఇప్పుడు ఆ రచ్చను ఎందుకు రెచ్చగొడుతున్నారు. ప్రతిపక్షపార్టీని డిఫెన్స్‌లో పడేయడంలో, ప్రతిపక్ష నేతను కార్నర్‌ని చేయడంలో చంద్రబాబు అండ్ కో బాగానే సక్సెస్ అవుతున్నారు. కానీ ఆ విజయం వళ్ళ అగ్రిగోల్డ్ బాధితులకు ఒరిగేదేంటి? లక్షలాది మంది ప్రజలు సంవత్సరాలుగా ఆందోళన చెందుతూ ఉంటే పాలకులకు మాత్రం చీమకుట్టినట్టుగా కూడా ఎందుకు లేదు? అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే విషయంలో కోర్టులు కూడా ఇప్పటికే చాలా సార్లు స్పందించాయి. అయినా కూడా ప్రభుత్వం తాత్సారం చేస్తోందంటే అర్థమేంటి? అగ్రిగోల్డ్ అక్రమాలతో ఎలాంటి సంబంధాలు లేకపోతే….బాధితులకు న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే ఆ బాధితులకు కచ్చితమైన సమాచారం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు. న్యాయం చేస్తాం. చట్టం తనపని తాను చేసుకుపోతుంది లాంటి రోటీన్ డైలాగులు వినీ వినీ ప్రజలకు ఎప్పుడో విసుగొచ్చింది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇంత రచ్చ జరిగిన తర్వాత అయినా….ఎంత కాలంలో న్యాయం చేస్తారు? ఏం న్యాయం చేస్తారు? అగ్రిగోల్డ్ ఆస్తుల విషయంలో ఏం నిర్ణయాలు తీసుకోబోతున్నారు లాంటి విషయాలపైన సభకు కచ్చితమైన సమాచారం ఇచ్చి ఉంటే అప్పుడు బాధితులకు ఊరట కలిగేది. అలా కాకుండా అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలన్న విషయాన్ని పక్కకుపెట్టి ప్రతిపక్షనేతతో ఛాలెంజ్‌లు విసురుకుంటూ….ఎప్పుడో జరిగిపోయిన స్పీకర్ మాటల ఇష్యూని హైలైట్ చేస్తూ సభను నిర్వహిస్తూ ఉండడం వళ్ళ బాధితులకు ఏంటి ఉపయోగం. అలాంటి చర్చల కోసం ప్రజాధనం ఖర్చు చేసే హక్కు ప్రభుత్వానికి ఉంటుందా? పర్సనల్ ఇగోలు, పొలిటికల్ లాభాలు కోసం సభలో కొట్లాడుకునే ప్రజాప్రతినిధులకు ప్రజలు జీతభత్యాలు ఎందుకు ఇవ్వాలి?