తెలుగుదేశం పార్టీ ఏ ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిందో.. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకోగలిగిందనే అంచనాలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి. విభజన హామీలను హామీలను అమలు చేయకుండా.. ఏపీని ఎంత దారుణంగా వంచించారో… దేశ ప్రజల ముందు ఉంచాలనుకున్నారు. ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ సక్సెస్ అయింది. టీడీపీ ఇచ్చిన అవిశ్వాస నోటీసునే.. స్పీకర్ పరిగణనలోకి తీసుకోవడం దీనికి ప్లస్సయింది. చర్చను ప్రారంభించిన ఎంపీ గల్లా జయదేవ్.. సూటిగా .. ఏపీ జరిగిన అన్యాయాన్ని వివరించారు. న్యాయం చేస్తామన్న ప్రధానమంత్రి ఎలా తప్పించుకుంటున్నారో సూటిగా పార్లమెంట్ ద్వారా దేశ ప్రజల ముందు ఉంచగలిగారు.
తెలుగుదేశం పార్టీ అవిశ్వాస లక్ష్యం… ప్రభుత్వాన్ని పడగొట్టడం కాదు. ఈ విషయాన్ని టీడీపీ ఎంపీలు ముందు నుంచీ చెబుతున్నారు. టీడీపీ లక్ష్యం… ఏపీ సమస్యలను జాతీయ స్థాయిలో చర్చనీయాంశం చేయడమే. టీడీపీ అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ అంగీకరించినప్పుడే.. విభజన హామీలు హాట్ టాపిక్ అయ్యాయి. ఇంగ్లిష్ లో గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు హిందీలో చేసిన ప్రసంగాలు… అధికార పార్టీకి సూటిగా గుచ్చుకున్నాయి. ఈ విషయాలకు బీజేపీ నేతలు సమాధానాలు చెప్పుకోలేకపోయారు. ఎప్పుడూ చెప్పే రొటీన్ సమాధానాలే తప్ప…సూటిగా.. ఫలానా హామీ నెరవేర్చామని కానీ.. ఫలానా సమయంలోపు నెరవేరుస్తామని కానీ చెప్పలేకపోయారు. ఈ విషాయన్ని పార్లమెంట్ వేదికగా ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో విజయం సాధించారు.
అసలు అవిశ్వాస తీర్మానం పెట్టింది.. తెలుగుదేశం పార్టీ అయితే.. ఆ పార్టీ ఎంపీలు లెవనెత్తిన అంశాలపై మాట్లాడకుండా… హోంమంత్రి రాజ్ నాథ్ తో పాటు ప్రధానమంత్రి మోదీ కూడా.. మొదట్లో రాజకీయ ప్రసంగాల చేసుకుంటూ వెళ్లారు. ఈ విషయంలో టీడీపీ ఎంపీలు దూకుడుగా వెళ్లారు. పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. తెలుగుదేశం పార్టీ ఈ అవిశ్వాస తీర్మానం ద్వారా సాధించిన మరో విజయం… బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలన్నింటినీ కూడగట్టడం. అదే సమయంలో బీజేపీతో స్నేహానికి ఊగిసలాటలో ఉన్న పార్టీలనూ దూరం చేయడంలోనూ అవిశ్వాసం సక్సెస్ అయింది. ఒక్క రోజు ముందు.. ప్రభుత్వానికి మద్దతుగా ఓటేస్తామని చెప్పిన శివసేన తెల్లవారే సరికి… మనసు మార్చుకుంది.
ఈ అవిశ్వాస తీర్మానంతో… తెలుగుదేశం పార్టీ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించబోతున్న విషయం స్పష్టమయంది. అందర్నీ ఏకం చేసే విషయంలో చంద్రబాబు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో.. ఇక ముందు.. బీజేపీకి, మోదీకి వ్యతిరేకంగా జరిగే రాజకీయాల్లోనూ… టీడీపీది ప్రముఖ పాత్రే కానుంది. చంద్రబాబు ఈ రోజే ఢిల్లీకి వెళ్లి ప్రాంతీయ పార్టీలతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించబోతున్నారు.