తెలంగాణలో ఇప్పుడు విలీనాల సీజన్ నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు.. తమ రంగును పసుపు నుంచి… గులాబీగా మార్చుకోవడానికి రెడీ అయిపోయారు. ఈ మేరకు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే.. అనుచరులతో కలిసి… అమరావతి వెళ్లి… టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి… కృతజ్ఞతలు చెప్పి వచ్చారు.. సండ్ర, మెచ్చా నాగేశ్వరావు. ఆ తర్వాత వారిపై ఒత్తిడి పెరిగింది. టీఆర్ఎస్కు చెందిన ఓ రాజ్యసభ ఎంపీ.. సండ్రకు టచ్‌లోకి వెళ్లారు. మంత్రి పదవిని ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అనుచరులతో చర్చించేందుకు… ఓ సమావేశం నిర్వహించారు.
సత్తుపల్లిలో శుక్రవారం నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో రెండు గంటలకుపైగా సండ్ర అంతర్గత సమావేశం నిర్వహించారు. తెరాస నుంచి వచ్చిన ఆహ్వానం గురించి ముఖ్య నాయకులకు వివరించారు. అత్యంత రహస్యంగా నిర్వహించిన ఈ సమావేశంలో ఆ పార్టీ మండల అధ్యక్షులతోపాటు ముఖ్య నేతల మనోభావాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ మారడమే మంచిదని వారు సలహా ఇచ్చినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత అశ్వారావు పేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కూడా… సండ్ర మాట్లాడారు. సండ్రతో చర్చించింది నిజమేనని.. పార్టీ ఫిరాయింపు గురించే మాట్లాడానని… మెచ్చా నాగేశ్వరరావు మీడియాకు చెప్పారు. ఆయితే.. ఇద్దరు నేతలు.. తమ పార్టీ మారడం లేదని ఖండన ప్రకటన చేశారు.
నిజానికి సండ్ర వెంకట వీరయ్య… టీఆర్ఎస్కు ఎదురొడ్డి పోరాడిన నేత. 2014లో గెలిచిన పదిహేను మందిలో 14 మంది వేరే పార్టీల్లో చేరిపోతే.. ఒక్క సండ్ర మాత్రమే టీడీపీ తరపున నిలిచారు. అంతే కాదు.. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లాల్సి వచ్చినా వెనక్కి తగ్గలేదు. చివరి వరకూ టీడీపీతోనే నిలిచారు. చంద్రబాబు టీటీడీ సభ్యుడి పదవి ఇచ్చారు. ఎన్నికల సమయంలో నామినేషన్‌కు అడ్డు వస్తుందన్న ఉద్దేశంతో రాజీనామా చేశారు. గెలిచిన తర్వాత రెండు రోజుల కిందటే.. మళ్లీ చంద్రబాబు నియమించారు. అయినా సండ్ర .. టీఆర్ఎస్లో చేరేందుకు నిర్ణయం తీసుకున్న ప్రచారం జరగడం.. టీడీపీ నేతల్ని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ తరపున ఇద్దరే గెలిచారు. వారిద్దరూ టీఆర్ఎస్లో చేరితే.. ఇక తెలంగాణ చట్టసభల్లో టీడీపీకి ప్రాతినిధ్యం లేనట్లే..!