కేంద్రంపై వైకాపా పెట్టబోతున్న అవిశ్వాస తీర్మానానికి ముఖ్యమంత్రి చంద్రబాబు మద్దతు ప్రకటించాలనే ఆలోచనలో ఉన్నట్టు కథనాలు వస్తున్నాయి. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ నేతలతో సుదీర్ఘంగా చంద్రబాబు మంతనాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో వైకాపా కేంద్రంపై ప్రవేశపెట్టబోయే అవిశ్వాసం అంశం కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. దానికి మనమెందుకు మద్దతు ఇవ్వకూడదని కొంతమంది మంత్రులు ప్రస్థావించారనీ, ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అన్ని అంశాలపైనా మనం సానుకూలంగా ఉండాలని అన్నారట.
అయితే, ఈ అంశంపై మరింత స్పష్టమైన నిర్ణయం తీసుకునేందుకు రేపు పాలిట్ బ్యూరో సమావేశం నిర్వహించబోతున్నారని సమాచారం. ఎన్డీయే నుంచి పూర్తిగా బయటకి వచ్చేయాలన్న అంశంపై కూడా రేపటి సమావేశంలో నిర్ణయం ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక, అవిశ్వాస తీర్మానం విషయానికొస్తే… ఈ నెల 21న వైకాపా తీర్మానం సభలో ప్రవేశపెట్టాలని అనుకుంది. కానీ, పార్లమెంటు సమావేశాల తీరు చూస్తుంటే వీలైనంత త్వరగా ముగించే దిశగా భాజపా సర్కారు వైఖరి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడే అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన నోటీసు కూడా వైకాపా ఇచ్చేసింది.
వైకాపాకి మద్దతు ఇవ్వడం సరైనదేనా అనే అంశంపై కూడా పార్టీలో సుదీర్ఘ చర్చ జరుగుతోందని సమాచారం. ఎలాగూ ఎన్డీయే నుంచి బయటకి వచ్చేద్దామని అనుకుంటున్నాం కాబట్టి, ఇంకోపక్క అవిశ్వాసం ద్వారా రాష్ట్రంలో తమను దోషిగా నిలబెట్టేందుకు వైకాపా ప్రయత్నిస్తోంది కాబట్టి, ఆ అవకాశం ప్రతిపక్షానికి ఎందుకు ఇవ్వడం అనే అభిప్రాయాన్ని కొంతమంది మంత్రులు వ్యక్తం చేసినట్టు సమాచారం. అంతేకాదు, ఈ తీర్మానానికి మద్దతు ప్రకటించడం ద్వారా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజకీయాలకు అతీతంగా టీడీపీ వ్యవహరించిందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తానేది వారి ఆలోచనగా తెలుస్తోంది. ఈ విషయంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. వైకాపా అవిశ్వాసానికి టీడీపీ మద్దతు ఇవ్వడం ఖాయమైతే, దీన్ని తమ విజయంగా వైకాపా మరోసారి తీవ్రంగా ప్రచారం చేసుకుంటుంది. ఇప్పటికే, ప్రత్యేక హోదాపై చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారనీ, తాము మొదట్నుంచీ పోరాడుతున్నాం కాబట్టే ఇవాళ్ల టీడీపీ కూడా తమ దారిలో ప్రత్యేక హోదాకి జై కొట్టాల్సి వచ్చిందని విమర్శలు చేస్తున్నారు. ఇక, అవిశ్వాసానికి కూడా మద్దతు పలికితే… వైకాపాకి మరో విమర్శనాస్త్రం బాగా పదునుపెట్టి వారి చేతిలో పెట్టినట్టు అవుతుందనే అనిపిస్తోంది.