కేసీఆర్ , కేటీఆర్ కన్నెర్ర చేయడంతో కేసుల పాలై సుదీర్ఘ కాలం జైల్లో ఉన్న తీన్మార్ మల్లన్నను బీజేపీలో చేరాలన్న షరతుల మీద న్యాయ సహాయం చేసి బయటకు రప్పించారు బీజేపీ నేతలు. ఆయన జైల్లో ఉన్న ప్పుడు ఎంపీ ధర్మపురి అరవింద్… మల్లన్న కుటుంబసభ్యులను ఢిల్లీకి తీసుకెళ్లి అమిత్ షాకు విజ్ఞాపనా పత్రాలు కూడా అందించారు. ఆ ప్రయత్నాలు ఫలించాయో.. లేకపోతే కేసులన్నీ తేలిపోయాయో కానీ ఆయనకు బెయిల్ వచ్చింది. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరారు.
జర్నలిస్ట్ అయిన మల్లన్న రాజకీయంగా పలుకుబడి సాధించారు. గ్రాడ్యూయేట్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచి తనకు ఎంత శక్తి ఉందో నిరూపించారు. తన వర్గాన్ని బలంగా పెంచుకోవడానికి మల్లన్న చాలా ప్రయత్నాలు చేశారు. పాదయాత్రలు ప్లాన్ చేసుకున్నారు. కానీ జైల్లో పెట్టడం వల్ల అన్నీ ఫెయిలయ్యాయి. ఆ తర్వాత బీజేపీలో చేరాల్సి వచ్చింది. కానీ బీజేపీలో ఆయనకు ఎక్కడా ప్రోత్సాహం లభించడం లేదు. బండి సంజయ్ దగ్గరకు రానివ్వలేదు. దీంతో ఇటీవల కాంగ్రెస్ పార్టీని పొగడటం ప్రారంభించారు. ఇప్పుడిప్పుడు ఎన్నికలు వస్తే ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో కాంగ్రెస్ స్వీప్ చేస్తుందన్నారు.
ఇప్పుడు ఆయన మళ్లీ తన అనుచర వర్గంతో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వరుసగా సమావేశాలు పెడుతున్నారు. బీజేపీ నేతగా ఉండి ఇలా సమావేశాలు పెట్టడాన్ని ఆయన అనుచరులే ప్రశ్నిస్తున్నారు. దీంతో ఇక తాను బీజేపీ ఆఫీసుకుపోనని ప్రకటించారు. అంతే కాదు .. సొంతంగా రాజకీయ కార్యక్రాలు చేపడతానని ప్రకటించారు. దీంతో మల్లన్న బీజేపీ నుంచి వెనక్కిపోయినట్లు అయింది.