మాది సంపన్న రాష్ట్రమని ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే గొప్పగా చెప్తుంటారు. కానీ రాను రానూ పరిస్థితి చూస్తుంటే ఇది పేద రాష్ట్రంగా మారుతున్నదేమో అనే అనుమానం కలుగుతుంది. ప్రభుత్వం ఘనంగా ప్రకటించుకున్న రుణ మాఫీ వల్ల రైతు కంట ఆనందం కనిపించడం లేదు. రైతు ఇంట ఆందోళ కనిపిస్తోంది.
ప్రజల ఆరోగ్య పరిక్షణ కోసం ఉద్దేశించిన ఆరోగ్యశ్రీ పథకానికి నిధుల కొరత శాపంగా మారింది. ప్రయివేటు ఆస్పత్రుల్లో చేసిన చికిత్సకు సంబంధించిన బిల్లుల చెల్లింపు బాగా జాప్యమవుతోంది. దీంతో మరోసారి ఆ ఆస్పత్రులు ఆందోళన బాట పట్టాయి. బిల్లు బకాయిలు చెల్లించే వరకూ ఆరోగ్యశ్రీ చికిత్సలు చేసేది లేదని గురువారం హెచ్చరించాయి.
రుణ మాఫీ సరైన విధానం కాదని రిజర్వ్ బ్యాంకు ఉద్దేశం. సరే, అది వేరే సంగతి. కేసీఆర్ ప్రభుత్వం రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. ఆమేరకు ఆదేశాలు ఇచ్చింది. కానీ ఇన్ స్టాల్ మెంట్ పద్ధతిలో నిధులు విడుదల చేయడం వల్ల దీని ఫలితం సరిగా అందడం లేదు.
ఆకలితో ఉన్న మనిషికి కడుపునిండా అన్నం పెడితే అది వేరు. ఇప్పుడో ముద్ద, అప్పుడో ముద్ద పెట్టినట్టుంది సర్కారు వారి రుణమాఫీ విధానం. రైతులు కట్టాల్సిన అసలు వడ్డీని ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించడం లో జాప్యం జరుగుతోంది. ఈ పథకం కింద బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం 17 వేల కోట్ల రూపాయలను చెల్లించాలి. రెండేళ్ల కిందటే చెల్లించి ఉంటే సమస్యే ఉండేది కాదు. కానీ అలా జరగలేదు. గత రెండేళ్లలో విడతల వారీగా 10 వేల 626 కోట్ల రూపాయల చెల్లింపు జరిగింది. మిగతా సొమ్మును మరో రెండేళ్లలో చెల్లిస్తామని, రైతులకు కొత్త రుణాలు ఇవ్వాలని బ్యాంకులను ప్రభుత్వం కోరుతోంది. కానీ బ్యాంకులు మాత్రం రుణాలు వసూలు కాకుండా కొత్తవి ఇవ్వడం లేదు. ఇంతోటిదానికి ఘనగా ప్రకటించడం దేనికి? రైతులకు ఆశచూపడం దేనికి? ఇబ్బందుల పాలు చేయడం దేనికో అర్థం కాదు.
ఖరీఫ్ సాగు సమయంలో బ్యాంకులు సతాయించడంతో కొందరు 3 రూపాయల వడ్డీకి ప్రయివేటు అప్పు తెచ్చి పాతరుణాన్ని తీర్చారు. కొత్త రుణం కోసం ఎదురు చూస్తున్నారు. దీని వల్ల రైతులకు మేలు జరిగినట్టా అనేది ప్రశ్న. కాంగ్రెస్ సభ్యులు సరిగ్గా ఇదే విషయాన్ని ఆ మధ్య అసెంబ్లీలో ప్రస్తావించారు. అయితే ఆ పార్టీ వారిపైతెరాస నేతలు ఎదురు దాడి చేశారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని పెద్ద పెద్ద మాటలు చెప్పారు.
మరో వైపు, ఆరోగ్య శ్రీ చెల్లింపుల్లో అంతులేని తాత్సారం వల్ల ప్రయివేట్ ఆస్పత్రుల వారు విసిగిపోయారు. బకాయిలను త్వరలోనే పూర్తిగా చెల్లిస్తామంటూ ఇటీవలే ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ అది జరగకపోవడంతో మరోసారి ఈ సేవలను నిలివేయాలని నిర్ణయించారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన నిధులను కూడా సకాలంలో ఇవ్వలేని స్థితిలో ఉందంటే ఇది నిజంగా సంపన్న రాష్ట్రమేనా అని అనుమానం రావడం సహజం. ప్రభుత్వ వైఖరి వల్ల ఆర్థిక పరిస్థితి దిగజారుతోందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ప్రాజెక్టుల నిర్మాణం, అభివృద్ధి సంక్షేమ పథకాలకు నిధులను ఖర్చు చేస్తున్న మాట నిజమే. అయినా ఇలాంటి ముఖ్యమైన విషయాల్లో చెల్లింపులు ఆలస్యం చేస్తూ రైతులను, ప్రజలు ఇబ్బంది పెట్టడం ఏమిటనేదే ప్రశ్న.