తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీకి షిఫ్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా కనీసం పది రోజులు ఉంటున్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటన నుంచి తిరిగి వచ్చి వారం రోజులు కాక ముందే మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. ఈ సారి ఆయన రెండు వారాల పాటు ఢిల్లీలో ఉంటారని చెబుతున్నారు. ఈ సారి ఢిల్లీ పర్యటన పూర్తిగా రాజకీయమేనని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. రైతు నాయకులతో సమన్వయం చేసుకోవడం.. ైతు ఉద్యమంలో చనిపోయినవారికి ఆర్థిక సాయం చేయడం వంటి పనులు చేయనున్నట్లుగా తెలుస్తోంది.
బీజేపీ నాయకుడు కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు రైతులపైకి కారు ఎక్కించిన ఘటన జరిగిన లఖీంపూర్ ఖీరీకి కేసీఆర్ వెళ్లి బాధిత కుటుంబాల్ని పరామర్శించి.. ఆర్థిక సాయం అందిస్తారని చెబుతున్నారు. కేసీఆర్ చాలా రోజులుగా ఢిల్లీలో మేధావులతో సమావేశం నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్నారు. మాజీ సివిల్ సర్వీస్ అదికారులు, ఆర్థికవేత్తలు, రైతు సంఘాల ప్రతినిధులతో ఈ సారి టూర్లో చర్చలు జరిపే అవకాశం ఉంది. రైతు నేత ఇమేజ్ కోసం ప్రయత్నం చేస్తున్న కేసీఆర్.. అందరితో మాట్లాడి అగ్రికల్చర్ పాలసీపై కసరత్తు చేస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై హైదరాబాద్‌లోనూ సమావేశం పెట్టే అవకాశం ఉంది.
ఢిల్లీ నుంచి కేసీఆర్ పలు రాష్ట్రాలకు పర్యటనలు జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది. లక్నో, ముంబై లాంటి నగరాలకు వెళ్లి కీలక నేతల్ని కలుస్తారని అంటున్నారు. మొత్తంగా కేసీఆర్ పూర్తి స్థాయిలో జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఆయన ఢిల్లీ కేంద్రంగా ఈ వ్యవహారాలు చేపడితే ఎక్కువ ప్రచారం లభిస్తుందని.. అందుకే ఎక్కువ కాలం అక్కడే ఉండాలనుకుంటున్నారని చెబుతున్నారు. మొత్తంగా అనధికారికంగా కేసీఆర్ ఢిల్లీకి షిప్ట్ అయినట్లేనని టీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.