ముందస్తు ఎన్నికల వస్తాయన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్న తరుణమిది. ఆ దిశగా కేంద్రంలోని భాజపా సిద్ధమౌతోంది. ఇక, తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఇక్కడి అధికార పార్టీలు కూడా ఎన్నికల మూడ్ లోకి వచ్చేశాయి. తెలంగాణలో అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక అడుగు ముందుకు వేసి, సిట్టింగులకు సీట్లు దక్కుతాయనీ, వారికే మరోసారి పార్టీ అవకాశం ఇస్తుందంటూ ఇప్పటికే స్పష్టం చేసేశారు! పనితీరు, నాయకుల ట్రాక్ రికార్డు వంటివి పరిగణనలోకి తీసుకున్నాకనే నిర్ణయం ఉంటుందని చెప్పినా… తెరాస తరఫున టిక్కెట్లు సిట్టింగులకే అనేది దాదాపు ఖరారు అయిపోయింది. ఇప్పుడు తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా ఇప్పుడు తెరాసను అనుసరిస్తోంది. ముందస్తు ఎన్నికల సంగతి ఎలా ఉన్నా… అభ్యర్థుల్ని ముందస్తుగానే ప్రకటించేస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. తెరాసను ధీటుగా ఎదుర్కోవాలంటే ఇప్పట్నుంచే అభ్యర్థుల్ని ఖరారు చేసేయడమే సరైన వ్యూహం అవుతుందన్నది ఆయన లెక్క!
ముందస్తుగా ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రకటించేయడం అనేది తెరాస వంటి ప్రాంతీయ పార్టీలకు కాస్త ఈజీగా తీసుకోగలిగే నిర్ణయం. ఇదే బాటలో కాంగ్రెస్ పార్టీ కూడా నడుస్తుందంటే… ఆచరణ సాధ్యమా అనేది ప్రశ్న..? తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నాయకుల ఐకమత్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనేముంది..! అందరూ కలిసి ఉన్నట్టుగానే కనిపిస్తారు. కానీ, పదవులూ నియామకాలూ వంటి విషయాలకు వచ్చేసరికి ఎవరి వ్యూహం వారికి ఉంటుంది. ఎవరికివారు సొంత ప్రయత్నాలు మొదలుపెట్టేస్తారు. ఢిల్లీ వెళ్లిపోతారు. సాటి నేతలపై ఫిర్యాదులకు కూడా వెనకాడరు. ఈ మధ్య పీసీసీ పీఠం కోసం ఎంతమంది నాయకులు ఎన్నిరకాలుగా ప్రయత్నాలు చేశారో చూశాం కదా! అలాంటిది, ఎమ్మెల్యే టిక్కెట్లు ఎవరికి ఇస్తామనేది ఇప్పుడే ప్రకటించేస్తామంటే… అసంతృప్తులను అడ్డుకోవడం సాధ్యమైన పనేనా..? అది సాధ్యం కాదనడానికి తాజా ఘటనే అందుకు ఉదాహరణ అని చెప్పుకోవచ్చు.
ఇబ్రహీంపట్నం నియోజక వర్గంలో కొంతమంది నేతల్ని కాంగ్రెస్ లోకి చేర్చుకునే కార్యక్రమం ఈ మధ్యనే జరిగింది. పార్టీ పెద్దలంతా అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా మల్లేష్ అనే అభ్యర్థిని వచ్చే ఎన్నికల్లో గెలిపించాలంటూ కాంగ్రెస్ పెద్దలు అక్కడ ప్రకటించారు. దీంతో ఈ అంశం పంచాయితీ అయిపోయింది. మాజీ ఎమ్మెల్యే బాల్ రెడ్డి రంగారెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఎన్నాళ్లుగానో పార్టీ నమ్ముకుని ఉంటున్న తనను కాదని.. ఎవరికో టిక్కెట్ ఇచ్చేస్తారంటూ ఎలా ప్రకటిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ తీరుపై మండిపడ్డారు. ఈ పంచాయితీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరకు వెళ్లింది. అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుంతియా వరకూ వెళ్తే తప్ప… కొంత ఉపశమనం లభించలేదు. సో… ఒక టిక్కెట్ గురించి ముందస్తుగా మాట్లాడినందుకే ఇంత రగడ జరిగితే… రాష్ట్రంలోని అన్ని స్థానాలకూ ముందస్తుగా అభ్యర్థుల ప్రకటన అంటే… ఆచరణ సాధ్యమయ్యే వ్యవహారమేనా..? ప్రకటించాక తలెత్తే అసమ్మతిని తట్టుకోగలిగే ముందస్తు వ్యూహం ఉత్తమ్ దగ్గరుందా..?