వందకుపైగా అభ్యర్థులను ముందే ప్రకటించేసి, ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు తెరాస అధ్యక్షుడు కేసీఆర్. దానికి ధీటుగా కాంగ్రెస్ పార్టీ కాస్త ఆలస్యంగా ప్రచారం మొదలుపెట్టింది. ఇక, అభ్యర్థుల ఎంపిక విషయానికొస్తే… ఇంకొంత సమయం పట్టేట్టుగానే పరిస్థితులు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి టిక్కెట్లు కోరుకుంటున్న ఆశావహుల జాబితా కూడా బాగా పెద్దగానే ఉన్నట్టు సమాచారం. ఇప్పటివరకూ, ఎమ్మెల్యే టిక్కెట్లు కావాలంటూ దాదాపు 1500లకుపైగా అప్లికేషన్లు పార్టీకి అందినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ నుంచి కూడా చాలామందికి టిక్కెట్లు ఇచ్చేస్తామంటూ కీలక నేతల నుంచి హామీలు పొందినవారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో టి. కాంగ్రెస్ టిక్కెట్ల కేటాయింపు ఆసక్తికరంగా మారుతోంది.
ప్రస్తుతం పార్టీకి అందిన దరఖాస్తులను క్రోడీకరించే కార్యక్రమం శనివారం మొదలౌతుందని టి. కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఒక్కో నియోజక వర్గానికి ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేయడమే ఈ ప్రక్రియ ఉద్దేశం అంటున్నారు. ఇలా ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను సిద్ధం చేశాక, ఈ నెల 10న తెలంగాణకు ఢిల్లీ నుంచి చిత్తరంజన్ దాస్ అధ్యక్షతన రాబోతున్న స్క్రీనింగ్ కమిటీ ముందు ఉంచుతారు. ఒక్కో నియోజక వర్గంలో చివరి దశకు చేరిన ఆ ముగ్గురి అభ్యర్థుల బలాబలాలను ఆ కమిటీ పరిశీలించి, ఒకరికి టిక్కెట్ ఇవ్వమని సూచిస్తుంది. ఈ ఎంపికలో భాగంగా ముగ్గురి అభ్యర్థులపై కూడా ఒక రహస్య చేయాలనే ఆలోచనలో కమిటీ ఉన్నట్టుగా కూడా చెబుతున్నారు. సో… కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక జరగాలంటే ఇంత ప్రక్రియ ఉందన్నమాట.
ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది! మహాకూటమి పొత్తుల్లో భాగంగా ఇతర పార్టీలతో సీట్ల సర్దుబాటు చేసుకుంటూనే… సొంతంగా 90కి తగ్గకుండా నియోజక వర్గాల్లో పోటీ చేయాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. అయితే, వాస్తవ పరిస్థితి చూసుకుంటే… మొదట్లో టీడీపీకి 10 సీట్లు ఇద్దామనుకున్నారట, కానీ, మరో ఐదు సీట్లు అదనంగా కావాలనే పట్టుదల టీడీపీ నుంచి ఉన్నట్టు సమాచారం. ఇక, కోదండరామ్ పార్టీ టీజేయస్ కి ఇంతకుముందు అనుకున్న కంటే ఎక్కువ స్థానాలే ఇవ్వాల్సి రావొచ్చు. ఎందుకంటే, ఆ పార్టీకి భాజపా నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నట్టు వినిపిస్తోంది. ఇక, ఇతర పార్టీలకు ముందుగా అనుకున్నట్టుగా పది లోపు స్థానాలు కట్టబెట్టి, ఒప్పించే అవకాశం కనిపిస్తోంది. కానీ, టీడీపీ, టీజేఎస్ ల సంఖ్య తగ్గించడం కష్టమే. అలాగని, ఏ పార్టీనీ కాంగ్రెస్ వదులుకునే పరిస్థితి లేదు. కూటమి నుంచి ఎవరు పక్కకు వెళ్లినా తెరాస వ్యతిరేక చీలినట్టే అవుతుంది కదా! ఈ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సొంతంగా 90 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసే కసరత్తు చేస్తున్నా… ఆ తరువాత, అసంతృప్తులు తప్పవనే పరిస్థితి కనిపిస్తోంది. పొత్తుల్లో భాగంగా ఇతరులకు కేటాయించాల్సిన స్థానాలపై కూడా మరో సర్వే చేయించే ఉద్దేశంలో కాంగ్రెస్ ఉన్నట్టుగా కూడా వినిపిస్తోంది.