తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారన్న ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ పదే పదే ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలవడం.. రాహుల్ గాంధీ పర్యటనకు రావడం… వంటివన్నీ… ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసినప్పుడు.. జమలీ ఎన్నికలంటూ జరిపితే మేం అనుకూలమే అనే ప్రతిపాదన పెట్టినట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో అయినా.. లేకపోతే ఫిబ్రవరిలో అయినా… ఎన్నికలకు సిద్ధమేనని చెప్పారంటున్నారు. ఇప్పుడు.. రాజస్థాన్, మధ్య ప్రదేశ్, చత్తీస్ గఢ్ ఎన్నికలతో పాటే.. తెలంగాణకూ ఎన్నికలకు వెళ్తారని ఇప్పుడు చెబుతున్నారు.
మూడు రాష్ట్రాల ఎన్నికలతో కాంగ్రెస్ పుంజుకుంటుందనా..?
ఈ ఏడాది చివరిలో రాజస్థాన్, మధ్యప్రదేశ్ చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ మూడు రాష్ట్రాల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పోటీ ఉంటుంది. అధికారంలో ఉంది బీజేపీ. ఇటీవలి కాలంలో ఆయా రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ వరుసగా ఓడిపోతూ వస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయవర్గాల్లో జరుగుతున్న ప్రచారం ఏమిటంటే.. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్‌లలో కాంగ్రెస్ పార్టీ మంచి విజయం సాధించబోతోందని చెబుతున్నారు. ఆ విజయాల తర్వాత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అనుకూల పవనాలు వీస్తే.. ప్రాంతీయ పార్టీలు కూడా ఆ వైపుగా ఆలోచిస్తాయి. తెలంగాణలో కూడా.. ఆ ప్రభావం ఉంటుంది. జాతీయ రాజకీయ ప్రభావం.. తెలంగాణపై ఉంటుంది. ఇది తమకు నష్టం అని టీఆర్ఎస్ భావిస్తోంది. ఎందుకంటే.. తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రధాన పోటీదారు కాంగ్రెస్. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లాభం చేకూరి బలపడుతుంది కాబట్టి.. వాటితో పాటే ఎన్నికలకు ఎదుర్కోవడం మంచిదని… కేసీఆర్ భావిస్తున్నారు.
హిందూత్వ ఎజెండాతో బీజేపీ బరిలోకి దిగబోతోందనా..?
2019 వరకు బీజేపీ.. దేశంలో పెద్ద ఎత్తున పొలిటికల్ పొలరైజేషన్ చేస్తోంది. ఇది హిందూ- ముస్లిం డివైడ్ ఆధారంగా ఉంటుంది. ఎందుకంటే.. అస్సాంలో వివాదాస్పదమవుతున్న ఎన్నార్సీ వ్యవహారం, కశ్మీర్లో జరుగుతున్న పరిణామాలు.. చూస్తున్నాం. ఆర్టికల్ 35 ఏ, గో రక్షా పేరుతో జరుగుతున్న దాడులు చూస్తున్నాం. రామ మందిరం ఇష్యూ మళ్లీ మొదటికి వస్తుందని చెబుతున్నారు. సొంత ఎజెండాతో వెళ్తేనే బీజేపీకి రాజకీయ ప్రయోజనం ఉంటుందని… ఆ పార్టీ నేతలు ఓ నిర్ణయానికి వచ్చారు. ఈ ఎజెండా ఏమిటంటే.. హిందూత్వం. ఈ ఏజెండాతో బీజేపీ ఎన్నికలకు వెళ్తే.. దేశంలో ఓ పెద్ద పొలిటికల్ పొలరైజేషన్ వస్తుంది. ఇలాంటి వాతవరణం తెలంగాణలో కూడా ప్రభావం చూపితే.. ముస్లిం ఓటింగ్.. టీఆర్ఎస్కు రాకుండా పోతుందనేది.. కేసీఆర్ భయం. ఎందుకంటే.. తెలంగాణలో ముస్లిం జనాభా 12 శాతం ఉంది. ఇక్కడ ఎంఐఎంతో కలిసి ఉన్నారు. ఎంఐఎం జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకిస్తోంది. తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్కు మద్దతిస్తోంది. దేశంలో హిందూ-ముస్లిం పొలిటికల్ పొలరైజేషన్ జరిగితే… టీఆర్ఎస్.. బీజేపీకి అనుకూలంగా ఉందన్న అభిప్రాయం కలిగితే.. ఎంఐఎం మద్దతు ఇవ్వడం కష్టమే. ఒక్క ముస్లింలకే కాదు.. దళితులతో పాటు ఇతర వర్గాల్లోనూ ఆందోళన ఉంది. బీజేపీకి వ్యతిరేకంగా చాలా వర్గాలు ఉన్నాయి. వీరందరూ దూరమవుతారన్న ఆందోళన కేసీఆర్‌కు ఉంది.
రైతు అసంతృప్తి పెరగక ముందే ఎన్నికలు పూర్తి చేయాలనా..?
అలాగే రైతు బంధు పథకం వైఫల్యం… కూడా… తెలంగాణ రాష్ట్ర సమితికి ఇబ్బందికరమే. రైతు బంధు పథకం వల్ల ఆరవై శాతం మంది రైతులు మాత్రమే ప్రయోజనం పొందారు. కౌలు రైతులతో పాటు భూమి యజమాన్య హక్కు లేకుండా సాగు చేసుకునేవారెవరికీ… సాయం అందలేదు. అలాగే.. ఎన్నికలు మార్చి, ఏప్రిల్ తర్వాత జరిగితే.. రైతుల అసంతృప్తి మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందకంటే.. అప్పుడు పంటలు చేతికొచ్చే సీజన్. గిట్టుబాటు ధరలు లేకపోతే.. రైతులు తీవ్ర అసంతృప్తితో ఉంటారు. గతంలో ఇలాగే జరిగాయి. ఖమ్మంలో రైతులకు బేడీలు వేసిన ఘటన కూడా చోటు చేసుకుది. ఏప్రిల్ …మే నెలలో అయితే ఇలాంటి విషయాలు ముందుకు వస్తాయి. అందువల్ల రైతుల్లో ఉండే సానుకూలత పోయి.. వ్యతిరేకత వస్తుందనేది కేసీఆర్ ఆందోళన.
విపక్షాలు ఏకం కాక ముందే బరిలోకి దిగే ప్లానా..?
ఇక టీఆర్ఎస్లో కూడా అసంతృప్తి పెరిగిపోతోంది. రామగుండం, జగిత్యాల, సూర్యాపేట ఇవన్నీ ఉదారణలు. ఎమ్మెల్యే, ఇతర నేతల మధ్య విబేధాలు పెరిగిపోతున్నాయి. ఒకరంటే.. ఒకరికి పడని పరిస్థితి వచ్చింది. ఇవన్నీ ఎన్నికలు దగ్గర పడేకొద్దీ పెరిగిపోతాయి. అలాగే.. విపక్ష పార్టీలు ఇంకా.. సమీకృతం కాలేదు. కాంగ్రెస్ పార్టీనే ఇంకా సెట్ రైట్ కాలేదు. కాంగ్రెస్‌లోనే అనేక గ్రూపులున్నాయి. వారిని వారు సమన్వయం చేసుకోలేకపోతున్నారు. ఇతర పక్షాలను కలుపుకుని.. విశాల కూటమి ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేయలేకపోతున్నారు. అందువల్ల తెలంగాణ ప్రతిపక్షం ఏకం కాక ముందే ఎన్నికలు నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్, టీడీపీ తెలంగాణలో కలసి పోటీ చేసే అవకాశం ఉందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో… కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి టీడీపీ ఎంపీలు ఓటేశారు. అయితే.. నవంబర్లోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలు జరిపితే.. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు పెట్టుకునే అవకాశాల్ని నిలువరించవచ్చు. ఎందుకంటే… తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ పొత్తు అనేది ఏపీ పరిణామాల్ని నిర్ణయం అవుతుంది. అక్కడ అధికార పార్టీ ముందస్తుకు వెళ్లడం లేదు కాబట్టి… తెలంగాణలో నిర్ణయం తీసుకునే అవకాశం తక్కువ.
సీమాంధ్ర ఓటర్లు దూరం కాకూడదనేనా..?
ఇంకో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన అనేక మంది సెటిలర్లు ఉన్నారు. వీరు హైదరాబాద్ చుట్టుపక్కలే కాదు.. ఇతర జిల్లాల్లోనూ ప్రభావం చూపిస్తారు. 2014లో టీడీపీ 15, బీజేపీ 5 సీట్లు గెలుచుకోవడం వెనుక.. సీమాంధ్రుల ఓట్లే కీలకం. ఇప్పుడు బీజేపీపై సీమాంధ్ర ఓటర్లు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. రేపు 2019లో ఏపీతోపాటు… తెలంగాణకూ ఎన్నికలు జరిగితే.. ఏపీలోలో… అక్కడ ప్రత్యేకహోదా ఎన్నికల అంశం అవుతుంది. మోడీ ప్రభుత్వం.. ఆ రాష్ట్రంపై చూపుతున్న విపక్ష కూడా హైలట్ అవుతుంది. అది తెలంగాణలో ఉన్న సీమాంధ్ర ఓటర్లపై ప్రభావం చూపుతుంది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. రాహుల్ గాంధీ బహిరంగసభ శేరిలింగం పల్లిలో పెట్టడానికి కారణం అదే. ఏపీలో పరిణామాలు.. తెలంగాణలోని సీమాంధ్ర ఓటర్లపై ప్రభావం చూపిస్తే.. ఖమ్మం, నిజామాబాద్ లాంటి జిల్లాల్లో కూడా.. టీఆర్ఎస్కు నష్టం జరుగుతుందన్న అంచనా ఉంది.
ఇలాంటి కారణాలతో… కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని చెప్పవచ్చు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా… ప్రకటించకపోవచ్చు .. కానీ పరోక్షంగా తేల్చి చెప్పారు. సెప్టెంబర్‌లో హైదరాబాద్ బహిరంగసభలో దీన్ని నేరుగా ప్రకటించే అవకాశం ఉంది.