సంక్షేమంలో మాకు సాటిలేదని చెప్పే కేసీఆర్ ప్రభుత్వం, అప్పుల అప్పారావు టైపా? అప్పులు చేస్తే గానీ దీని హామీలు అమలు కావా? అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సంద్భంగా ప్రతిపక్ష సభ్యులు చెప్తున్న విషయాలను చూస్తే ప్రభుత్వం చెప్పుకునే గొప్పలమీద అనుమానం కలుగుతుంది. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు అని చెప్పుకొనే తెరాస సర్కార్, ఎడాపెడా అప్పుల మీదే ఆధారపడి పథకాలను ప్రకటిస్తున్నదా అనే ప్రశ్న ఉదయిస్తుంది. పైగా ఉమ్మడి ఏపీలో ఏళ్లకేళ్లు తెచ్చిన రుణం కంటే 21 నెలల్లో ప్రస్తుత ప్రభుత్వం తెచ్చిన రుణం తక్కువేం కాదనే మాట ఆందోళనకరం.
మహబూబ్ నగర్ జిల్లాలో 80 నుంచి 90 వాతం పూర్తయిన ప్రాజెక్టులకు వెయ్యి కోట్ల రూపయాలు కూడా కేటాయించలేదని టీడీపీ సభ్యుడు రేవంత్ రెడ్డి అభ్యంతరం చెప్పారు. వీటిని ఏడాదిలోగా పూర్తిచేస్తే మంత్రికి సన్మానం చేస్తామన్నారు. అంటే, ఈ ప్రాజెక్టులు ఇప్పట్లో పూర్తి కావనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. జిల్లాలోనూ అదే అనుమానం చాలా మందిలో ఉంది. మరికొన్ని నిధులిస్తే పూర్తయ్యే ప్రాజెక్టును పెండింగులో పెట్టడం వల్ల వాటి ఖర్చు మరింత పెరుగుతుంది.
రుణాల విషయంలో రేవంత్ రెడ్డి చెప్పిన మాట నిజమైతే అది నిజంగా అందరికీ ఆందోళన కలిగించే విషయమే. 1956 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులు తెలంగాణకు మిగిల్చిన అప్పులు రూ. 69 వేల కోట్లయితే, గత 21 నెలల్లో కేసీఆర్ ప్రభుత్వం రూ. 50 వేల కోట్ల అప్పులు తెచ్చిందని రేవంత్ అన్నారు. దీన్ని బట్టి, సంపన్న రాష్ట్రమంటూ భారీ పథకాలను ప్రకటించడం అంతా ఉత్తుత్తి పటాటోపమా అనే అనుమానం కలుగుతుంది. రేవంత్ చెప్పిన మరో విషయం, డబుల్ బెడ్ రూం ఇండ్లకు సంబంధించింది. బడ్జెట్ లో వీటికి నిధులు కేటాయించకుండా అప్పులు తెచ్చి ఇండ్లు కట్టిస్తామనడం సరికాదన్నారు.
అప్పులు చేసి పథకాలు అమలు చేస్తాం, ఆస్పత్రులు నిర్మిస్తాం అనడాన్ని బీజేపీ నాయకులు లక్ష్మణ్ కూడా తప్పు పట్టారు. శక్తికి మించి అప్పులు చేసి భావి తరాలపై నెట్టివేయడం సరికాదన్నారు. సీఎల్పీ నాయకుడు జానారెడ్డి కూడా ప్రభుత్వ పథకాల అమలుకు బడ్జెట్లు సరిపోవని, భారీగా అప్పులు చేయాల్సి వస్తుందని అన్నారు. మొత్తం మీద, గుజరాత్ తర్వాత మనదే సంపన్న రాష్ట్రమని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం, క్రమంగా దీన్ని పేద రాష్ట్రంగా, అప్పుల రాష్ట్రంగా మారుస్తున్నదా అనే అనుమానం కలుగుతోంది.
సంక్షేమంలో నంబర్ వన్ అనిపించుకోవడానికి ఎడా పెడా అప్పులు చేస్తే చివరకు దేశంలోనే బీద రాష్ట్రంగా మారే ప్రమాదం ఉంది. లేనిపోని గొప్పలకు పోయి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం సరికాదు. ఓ వైపు ఆశించిన మేరకు ఉద్యోగ నియామకాలు జరగక యువత నిరాశళో ఉంది. ప్రయివేటు కంపెనీలు పెద్ద ఎత్తున హైదరాబాదుకు తరలి వస్తుండటం పెద్ద ఊరటే. బ్రాండ్ హైదరాబాద్ పుణ్యమాఅని ఈ విధంగా యువతకు ప్రయివేటు రంగంలో ఉద్యోగాలు దొరుతున్నాయి. అయితే టీచరో పోస్టుల భర్తీకి కూడా మీనమేషాలు లెక్కించడమే అంతుపట్టని విషయం. తెరాస ప్రభుత్వం వాస్తవాలను గుర్తెరగాలి. నేలవిడిచి సాము చేయకుండా నేలమీదే నిలబడాలి. సంక్షేమంలో సాటిలేదంటూ రుణాల బాట పడితే అది రహదారి కాదు అడ్డదారి అవుతుంది. అనేక విషయాల్లో ఒక వినూత్నమైన విజన్ తో పనిచేస్తున్న కేసీఆర్, అప్పుల విషయంలో మాత్రం ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటేనే రాష్ట్రానికి, ప్రజలకు మేలు.