కేంద్రంపై ఏపీ ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు రావడం లేదు. సభ ఆర్డర్ లో ఉండటం లేదన్న ఒకే ఒక్క కారణంతో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సభ ఆర్డర్ లోకి రాకపోవడానికి కారణం ఎవరు.. తెరాస, అన్నాడీఎంకే ఎంపీల ఆందోళనలు. ప్రతీరోజూ వీరు వెల్ లోకి దూసుకొస్తూ ఉండేసరికి.. ఇది భాజపా వ్యూహంలో భాగం అనేదే అందరికీ కలిగే అనుమానం. తమిళనాడులో జయలలిత మరణం తరువాత అక్కడ ఏర్పడ్డ రాజకీయ సంక్షోభాన్ని భాజపా బాగా వినియోగించుకుంది అనేది బహిరంగ రహస్యం. అంతేకాదు, ఓపీయస్, ఈపీయస్ గ్రూపులను కలపడంలో ప్రధాని నరేంద్ర మోడీ చొరవ ఉందని వారే ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలో భాజపా వ్యూహానికి అన్నాడీఎంకే మద్దతు ఇస్తున్నా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ, తెరాస సభ్యులు ఎందుకు ప్రతీరోజూ ఒకే అంశంతో సభకి అంతరాయం కలిగిస్తున్నట్టు..? ఓ పక్క కాంగ్రెసేతర, భాజపాయేతర ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటే లక్ష్యమని కేసీఆర్ చెబుతూ, సభలో భాజపాకు అనుకూల వాతావరణం కల్పించే చొరవ ఎందుకు తీసుకుంటున్నారు..?
ఏపీ సమస్యలతో మాకేం పని, పక్కింటో పెళ్లి జరుగుతుంటే మేం సున్నాలేసుకోవడం ఏంటంటూ కొంతమంది తెరాస నేతలు మాట్లాడుతున్నారు. కరెక్టే, ప్రత్యేక హోదా అనేది తెలంగాణ సమస్య కాదు..! కానీ, దీనిపై మద్దతు ఇస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు, కవిత మాట్లాడారు, ఒకరిద్దరు ఎంపీలు కూడా సాయం చేస్తామన్నారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం అనేసరికి… తెరాస వైఖరి మారిపోయింది. సరే, హోదా అంశానికి మద్దతు ఇస్తామని మాట మార్చేశారు… ఆ అంశాన్ని పక్కన పెడదాం..! ఇక్కడ అసలు విషయాన్ని తెరాస ఎంపీలు ఎందుకు ఆలోచించడం లేదు..? కేంద్రాన్ని ఏపీ కోరుతున్నదేంటీ.. విభజన హామీలను సక్రమంగా అమలు చేయాలని. దీన్లో భాగంగానే తెలంగాణకు కేంద్రం నుంచి దక్కాల్సిన ప్రయోజనాలు చాలానే ఉన్నాయి కదా. విభజన హామీలు అమలు కావాల్సిన అవసరం తెలంగాణకు లేదా..?
హైకోర్టు విభజన ఇంతవరకూ పూర్తి కాలేదు. రెండు రాష్ట్రాల మధ్యా పంపిణీ చేసుకోవాల్సిన ఆస్తుల సమస్యలు అలానే ఉన్నాయి. వెనుకబడిన ప్రాంతాలకు కేంద్రం ప్రత్యేకంగా ఇస్తామన్న నిధుల విషయమై కూడా తెలంగాణకు దక్కాల్సినవి రాలేదు. పరిశ్రమలకు రాయితీల అంశమై కూడా తెలంగాణకు దక్కాల్సినవి చాలానే ఉన్నాయి. ఇలా విభజన చట్టంలో రెండు రాష్ట్రాలకు చాలా హామీలను కేంద్రం ఇచ్చింది. కాబట్టి, ఈ అవిశ్వాస తీర్మానానికి తెరాస మద్దతు ఇస్తే… తీర్మానం చర్చకు రావడం తెలంగాణకు కూడా అవసరమే కదా. కానీ, ఏపీ అవిశ్వాసంతో మాకేంటి సంబంధం అన్నట్టుగా ఇప్పుడు తెరాస వ్యవహరిస్తోంది. మా రిజర్వేషన్ల అంశం మాకు ముఖ్యం అంటున్నారు. అదీ ముఖ్యమే.. కానీ, దాంతోపాటు ఇది కూడా అవసరమే కదా..!