ఫిరాయింపు నేతలతో రాజీనామా చేయించే పరిస్థితి తెలంగాణలో లేదనే చెప్పాలి. ఎలాగూ ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయమే ఉంది. కాబట్టి, అంతవరకూ ఇలానే తెరాస కాలక్షేపం చేస్తుందనడంలో అనుమానం లేదు. అయితే, తాజాగా టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రాజీనామాతో కొడంగల్ కు ఉప ఎన్నిక రావొచ్చనే ఊహాగానాలు వినిపించాయి. స్పీకర్ ఫార్మాట్ లోనే రేవంత్ రాజీనామా చేశారు. నిజానికి, ఆ పత్రం ఇంకా స్పీకర్ కు అందలేదు. పార్టీ అధినేత చంద్రబాబుకి తన రాజీనామా పత్రాన్ని రేవంత్ ఇచ్చారు. ఒకవేళ ఆ రాజీనామా స్పీకర్ కు అందితే, వెంటనే ఆమోదించాల్సి ఉంటుంది. అదే జరిగితే కొడంగల్ ఉప ఎన్నిక అనివార్యం. అలాంటి పరిస్థితి రావొచ్చనే అంచనాతోనే ఇప్పటికే కొడంగల్ వ్యవహారాలపై మంత్రి హరీష్ రావు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. అయితే, ఇదే సమయంలో సనత్ నగర్ స్థానానికి కూడా ఉప ఎన్నిక వచ్చే అవకాశాలు ఉన్నాయని కొంతమంది నేతలు అభిప్రాయపడుతున్నారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తెరాసలో చేరుతున్న తరుణంలో ఆయన చాలా హడావుడి చేశారు. గవర్నర్ ను కలిశారు, రాజీనామా చేసిన తరువాతే పార్టీని వీడుతున్నానంటూ ఓ పెద్ద డ్రామా నడిపారు. ఆ రాజీనామా పత్రం స్పీకర్ టేబుల్ మీదే కొన్నాళ్లుగా మూగులుతోంది! ఇప్పుడు రేవంత్ రాజీనామా పత్రం స్పీకర్ కు అందితే.. దీంతోపాటు తలసాని రాజీనామాను కూడా స్పీకర్ ఆమోదించాల్సి వస్తుంది కదా! ఒకవేళ రేవంత్ ది ఒక్కటే ఓకే చేసి, తలసానిది మళ్లీ పక్కన పెడితే పెత్తున విమర్శలు తప్పవు. దీన్నే ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకునేందుకు రేవంత్ ఉండనే ఉన్నారు. రెండు రాజీనామాలు ఒకేసారి అంగీకరించకపోతే స్పీకర్ తీరుపై ఎవరైనా కోర్టుకు వెళ్లే ఆస్కారం ఉంటుందనే అంటున్నారు.
రేవంత్ రాజీనామా ఇంకా స్పీకర్ కు చేరలేదు కాబట్టి, ప్రస్తుతానికి దీనిపై రాజకీయ వర్గాల్లో ఏమంత చర్చ జరగడం లేదు. కానీ, ఈ సమస్య ఏంటో తెరాసకు బాగా తెలుసు. అందుకే, సనత్ నగర్ నియోజక వర్గం బాధ్యతల్ని మంత్రి కేటీఆర్ కు అప్పగించారు! ఈ మధ్య తలసాని నియోజక వర్గంపై ఆయన ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల సమస్యలూ అంటూ హడావుడి చేస్తున్నారు. సో.. రేవంత్ రాజీనామా ఆమోదిస్తే, తలసానిది కూడా ఆమోదించాలి. ఇదో సమస్య వస్తుందని రేవంత్ రాజీనామాను కూడా పక్కనపెడితే.. అది రేవంత్ కి మరింత ప్లస్ అవుతుంది. తన రాజీనామా ఆమోదించి, ఉప ఎన్నికల్లో ఎదుర్కొనే సత్తా తెరాసకు లేదని ఆయన సవాల్ చేసేస్తారు కదా!