నాగచైతన్య కథానాయకుడిగా ‘తండేల్’ రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. సాయి పల్లవి కథానాయిక. చందూ మొండేటి దర్శకుడు. గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సంక్రాంతి బరిలో ఈ చిత్రం నిలుస్తుందని ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్ర బృందం ఓ నిర్ణయం తీసుకోవాల్సివుంది. అయితే ఇప్పుడు తండేల్కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఇదో నవలా చిత్రమని, ఓ నవల ఆధారంగా ఈ కథని రూపొందించారని తెలుస్తోంది.
తానా పురస్కారం పొందిన నవల మున్నీటి గీతలు. చింతకింది శ్రీనివాసరావు రచించారు. మృత్యకారుల జీవితాన్ని బేస్ చేసుకొని రాసిన మొట్టమొదటి నవలగా మున్నీటి గీతలు ప్రసిద్దికెక్కింది. పోలారావు,ఎల్లమ్మ… ఈ కథలోని ప్రధాన పాత్రలు. పోలారావు వృత్తి చేపల వేట. డబ్బులు ఎక్కువ సంపాదించి, తన భార్యని బాగా చూసుకోవాలన్నది తన ఆశ. గుజరాత్ లోని అరేబియా సముద్రానికి వలసపోయి, అక్కడ చేపల వేట సాగించడం మత్యకారుల జీవన శైలి. అయితే ఈసారి చేపల వేటకు వెళ్లినప్పుడు…సముద్రంలో తప్పిపోతారు. దాంతో పాకిస్థాన్ సైన్యం చేతిలో చిక్కుకుపోతారు. ఈ గుంపులో కథానాయకుడూ ఉంటాడు. ఆ తరవాత ఏమైందన్నదే కథ. ‘తండేల్’ కథ కూడా.. ఇంచుమించుగా ఇలా సాగేదే. పైగా రెండూ.. శ్రీకాకుళం నేపథ్యంలో సాగే కథలు. తండేల్ నిజ జీవిత కథని స్ఫూర్తిగా తీసుకొని చేస్తున్న సినిమా అని చిత్రబృందం ఇది వరకే చెప్పింది. అయితే ఈ స్ఫూర్తితో నవల ఎప్పుడో వచ్చింది. అలాంటప్పుడు ‘మున్నీటి గీతలు’ రైట్స్ తండేల్ టీమ్ తీసుకొందా, లేదా? అనే ఆసక్తి నెలకొంది. ఈవారంలో ‘తండేల్’కు సంబంధించిన ఓ ప్రెస్ మీట్ హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ కథకు సంబంధించిన స్ఫూర్తి ఎక్కడిదో దర్శకుడు చెబుతాడేమో చూడాలి.