కేసీఆర్ కు అత్యంత సన్నిహిత నేతలూ ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ తో బంధానికి శుభం కార్డు వేస్తున్నారు. గతంలో వారంతా పార్టీలోకి వచ్చిందే తడవుగా పదవులు కట్టబెట్టిన కేసీఆర్, పార్టీని వీడుతోన్న వారిని చూసి ఏమనుకుంటున్నారో కానీ, రాజకీయ వర్గాల్లో మాత్రం ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇదంతా కేసీఆర్ స్వయంకృతాపరాధం అనేందుకు పలు విషయాలను ఉదాహరిస్తున్నారు.
టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి జెండా మోసిన కార్యకర్తలను, ఉద్యమకారులను కాదని కొత్తగా పార్టీలో చేరిన నేతలకు అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ప్రాధాన్యత ఇచ్చారు. కీలకమైన పదవులను వారికే కట్టబెట్టారు. పుష్కరకాలం గులాబీ జెండా మోసిన నేతలకు కనీసం కార్పోరేషన్ పదవులనూ పెద్దగా ఇచ్చింది లేదు. కేవలం వ్యాపారవేత్తలు, ఫక్తు రాజకీయ నాయకులను నెత్తిన పెట్టుకొని పదవుల పంపకం చేపట్టారు.
అధికారం కోల్పోయేసరికి పవర్ కోసమే పార్టీలు మారిన ఆ నేతలు ఇంకా బీఆర్ఎస్ లోనే ఎందుకుంటారు..? అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లో చేరేందుకు ఒక్కొక్కరూ క్యూ కడుతున్నారు. ఇటీవల పార్టీ ఫిరాయింపు నేత ఇంటిని కొంతమంది బీఆర్ఎస్ నేతలు ముట్టడించారు. అందులో బాల్క సుమన్ మినహాయిస్తే ఆ నలుగురైదుగురు కార్పోరేషన్ చైర్మన్ పదవిని నిర్వర్తించిన నేతలే.
ఇప్పుడు ఇదే విషయాన్ని వివరిస్తూ కేసీఆర్ చేసిన తప్పిదాన్ని వివరిస్తున్నారు. ఉద్యమకాలంలో బీఆర్ఎస్ జెండా మోసిన వాళ్లకు పదవులు ఇస్తే ఎంత కమిటెడ్ గా ఉంటారో…పోచారం ఇంటి ముట్టడిలో పాల్గొన్న నేతలను చూస్తే అర్థం అవుతోంది. కానీ, కేసీఆర్ మాత్రం పవర్ పాలిటిక్స్ చేసేందుకు మాత్రమే పార్టీలో చేరిన నేతలకు పదవులు ఇచ్చి, ఉద్యమ శక్తులను దూరం చేసుకోవడమే ప్రస్తుత బీఆర్ఎస్ పతనానికి కారణమని విశ్లేషిస్తున్నారు.