ప్రమాదకరమైన వైరస్ దేశాన్ని వణికిస్తూంటే… వ్యాక్సినే సంజీవని అంటున్న ప్రభుత్వాలు.. తీవ్ర నిర్లక్ష్యాన్ని .. నిర్లిప్తతను ప్రదర్శిస్తున్న ఉదంతాలు తరచూ బయట పడుతున్నాయి. ప్రజలకు పంపిణీ చేయడానికి అటు కేంద్ర ప్రభుత్వం కానీ.. ఇటు ఏపీ సర్కార్ కానీ.. వ్యాక్సిన్ కోసం కంపెనీలకు ఆర్డర్ పెట్టలేదన్న విషయం బయటపడింది. దేశంలో నూట ముఫ్పై కోట్ల మంది జనాభా ఉంటే.. కేంద్రం ఇప్పటి వరకూ పన్నెండు కోట్ల డోసులను మాత్రమే కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన సంచలనాత్మక నివేదికను కొన్ని ఇంగ్లిష్ పత్రికలు ప్రకటించాయి. అయితే.. ఈ రిపోర్టులను కేంద్రం వెంటనే… ఖండించింది. జూలై వరకూ అసరమైన వ్యాక్సిన్ డోసులకు ఆర్డర్ పెట్టామని చెప్పుకొచ్చింది.
అయితే ఎంత పెట్టారు.. ఎంత మేర ప్రజలకు ఇస్తారన్న విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇదే తరహాలో ఏపీలోనూ రాజకీయం నడుస్తోంది. ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్ ఇచ్చేస్తున్నామని ప్రకటించిన ఏపీ సర్కార్.. ఇప్పటి వరకూ సొంతంగా సింగిల్ డోస్‌కు కూడా అడ్వాన్స్ కట్టలేదు.. ఆర్డర్ ఇవ్వలేదు. సీరం ఇనిస్టిట్యూట్… రష్యా వ్యాక్సిన్ తయారు చేస్తున్న రెడ్డిస్ ల్యాబ్స్‌తో పాటు కోవాగ్జిన్ ఉత్పత్తిదారు అయిన భారత్ బయోటెక్‌తోనూ..సీఎం జగన్ మాట్లాడినట్లుగా ఏపీ సర్కార్ వారి మీడియా విభాగం ప్రచారం చేసింది. కానీ అసలు విషయం ఏమిటంటే.. ఇప్పటి వరకూ ఒక్క డోస్‌కు కూడా.. ఆర్డర్ పెట్టలేదు. వ్యాక్సిన్ కంపెనీలేవీ.. ముందస్తుగా చెల్లింపులు లేకుండా డోసులు సరఫరా చేసే పరిస్థితి లేదు.
ఇప్పుడు అడ్వాన్స్ కడితే ఎప్పటికో డోసులు పంపిణీ చేస్తారు. అడ్వాన్సులు కట్టకపోతే… కట్టే అవకాశం కూడా లేదు. ఏపీ సర్కార్.. నిధుల కొరతతో ఉండటంతో.. కట్టే ఉద్దేశంలో కూడా లేనట్లుగా ఉంది. అందుకే సీఎం జగన్.. వ్యాక్సినేషన్‌కు ఫిబ్రవరి వరకూ పట్టొచ్చని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. ఇప్పటికే వ్యాక్సిన్ పథకం పేరుతో ప్రభుత్వం విరాళాల సేకరణ ప్రారంభించింది. ఉద్యోగుల జీతాల్లోనుంచి ఒక్కో రోజు జీతం తీసుకునేందుకు సిద్ధమైంది. ఉద్యోగుల జీతాల్లో నుంచి ఇలా తీసుకునేందుకు సర్క్యూలర్ జారీ చేయడం వివాదాస్పదమయింది. ఎన్ని విరాళాలు సేకరించినా… అప్పటికి కేంద్రం ఇచ్చే డోసులు మాత్రమే వేస్తారని చెబుతున్నారు. మొత్తానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చి.. కరోనా నుంచి రక్షించే విషయంలో… బయట చెబుతున్నదానికి.. అసలు చర్యలకు .. చాలా తేడా ఉందని.. స్పష్టమవుతోంది.