కరోనా వల్ల అన్ని వ్యవస్థలూ నష్టపోయాయి. ముఖ్యంగా చిత్రసీమకు సంబంధించి – అదో పెద్ద కుదుపు. అయితే విపత్తులోనూ పుంజుకునేవి కొన్నుంటాయి. ఈసారి అది ఓటీటీ అయ్యింది. కరోనాకు ముందు ఓటీటీ ఉంది. కానీ.. అదో సెపరేట్ సిస్టమ్ లా కనిపించింది. అమేజాన్, నెట్ఫ్లిక్స్ మినహా.. మిగిలినవేం పెద్దగా తెలీవు. మనవాళ్లకైతే.. ఇది `ఏ` సెంటర్ కి పరిమితమైన విషయాలు. ఓటీటీ అంటే.. మాస్ ప్రేక్షకులు `అదేంటి?` అని చూసేవాళ్లు. ఐటీ సెక్టార్లో పనిచేసే వాళ్లలో మాత్రమే ఓటీటీపై ఓ అవగాహన ఉండేది. పైగా ఓటీటీని భరించడం కష్టమైన విషయమే. సంవత్సర చందా వేయికి తగ్గింది లేదు. అలా… ఓటీటీని లైట్ తీసుకున్నారు.
కానీ కరోనా కాలంలో ఓటీటీ ఓ వరంలా మారిపోయింది. సినిమాలన్నీ అందులోనే. దాంతో… దిగువ తరగతి కూడా… ఓటీటీ వైపు చూడాల్సివచ్చింది. తెలుగులోనూ `ఆహా`, `జీ 5` లాంటి ఓటీటీ సంస్థలు ఊపందుకున్నారు. సబ్ స్క్రిప్షన్ కూడా తక్కువే. అమేజాన్, నెట్ ఫ్లిక్స్ ద్వారా వరల్డ్ సినిమా మరింత చేరువైంది. మలయాళ సినిమాల్నీ ఇష్టంగా చూడడం మొదలెట్టారు. వెబ్ సిరీస్ ల మజా.. అర్థమైంది. దాంతో.. ఓటీటీ కూడా ఓ భాగమైపోయింది. థియేటర్లో బొమ్మ పడితే కచ్చితంగా… థియేటర్లకే వస్తారన్నది నిర్మాతల నమ్మకం. ప్రేక్షకులూ అదే అనుకున్నారు. ఓటీటీని ఒక విధిలేని ప్రత్యామ్నాయంగానే చూస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఓటీటీ అయితే ఏంటి? థియేటర్ అయితే ఏంటి? అనుకుంటున్నారు. ఓరకంగా ఓటీటీలకు అలవాటు పడిపోయాయి. చిన్న, మధ్యతరగతి సినిమాల్ని థియేటర్లకు వెళ్లి చూసేంత తీరిక, ఓపిక, ఆ టికెట్ రేట్లని భరించే స్థోమత ఇప్పుడు లేకుండా పోయింది. అందుకే… గత కొంతకాలంగా ఇన్ని సినిమాలు విడుదల అయినా.. జనాలు లైట్ తీసుకుంటున్నారు. ఈ వారం విడుదలైన సినిమాలకు ఆదరణ అంతంత మాత్రమే. ఏ సినిమాకీ సరైన ఓపెనింగ్స్ లేవు.
మాస్ సినిమా పడితే కిక్కు తెలుస్తుంది… బొమ్మ దద్దరిల్లి పోతుంది… అన్నది నిర్మాతల నమ్మకం. శ్రీదేవి సోడా సెంటర్.. మాస్ సినిమానే. అయినా ప్రేక్షకులు కదిలి రాలేదే..? పెద్ద సినిమా బయటకు వస్తే తప్ప.. జనాలకు థియేటర్లకు వచ్చే ఊపు ఉందా, లేదా? అనేది తెలుస్తుంది. పెద్ద సినిమాలా.. ఇప్పట్లో రావు. చిన్న సినిమాలకా జనాలు రారు. ఇంకెలా థియేటర్ వ్యవస్థ నడిచేది..? రాబోయే రోజుల్లో సిటీమార్, లవ్ స్టోరీ, మహా సముద్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాలు రానున్నాయి. అయితే ఇవీ పెద్ద సినిమాలేం కాదు. మీడియం రేంజు సినిమాలు. ఈ సినిమాలకు జనాలు ఎగబడి వచ్చే పరిస్థితి లేదు. ఓ రకంగా… ఈ సినిమాలు విడుదల చేసే విషయంలోనూ నిర్మాతలు రిస్కు తీసుకుంటున్నట్టే. ఆచార్య, అఖండ లాంటి సినిమాలే వాస్తవ పరిస్థితులేంటో బయటపడతాయి. ఈ సినిమాలకు ఇది వరకటిలానే రికార్డు ఓపెనింగ్స్ వస్తే – కరోనా అంటే ప్రేక్షకులకు భయాలు లేవనే అనుకోవాలి. ఈ సినిమాకూ అరకొర వసూళ్లే వస్తే…థియేటర్ వ్యవస్థని ఓటీటీ పూర్తిగా మింగేసిందని అర్థం చేసుకోవాల్సిందే.