ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో దాడులు జరిగే అవకాశం ఉందన్న కేంద్ర నిఘా వర్గాల తాజా హెచ్చరికలు దేనికి సంకేతం..?ఇంటలిజెన్స్ వర్గాల హెచ్చరికలు వైసీపీ ఓటమి ఖాయమని జరుగుతోన్న ప్రచారానికి నిదర్శనమా..?
ఇప్పుడు ఏపీలో ఇదే హాట్ టాపిక్. అయితే, కేంద్ర నిఘా వర్గాలు వైసీపీ ఓడిపోతుందనో, కూటమి అధికారం చేపడుతుందనో స్పష్టం చేయలేదు. కాని, ఎన్నికల ఫలితాల తర్వాత కూడా అల్లర్లు జరిగే అవకాశం ఉందన్న హెచ్చరికలతో రాష్ట్రంలో విజయం ఎవరిని వరిస్తుందనే విషయంపై రాజకీయ పండితులు ఓ అవగాహనాకు వస్తున్నారు.
ఇప్పటికే వైసీపీ నేతలు చాలాచోట్ల రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ తోపాటు రిగ్గింగ్ జరిగిందని ఆరోపణలు చేస్తుండటం వారిలో ఓటమి భయానికి సంకేతమనే అభిప్రాయాలు వస్తున్నాయి. తాజాగా కేంద్రం అల్లర్లు జరిగే అవకాశం ఉందని అప్రమత్తం చేసిందంటే…వైసీపీ అధికారం కోల్పోవడం ఖాయమని, ఆ ఓటమిని జీర్ణించుకోలేక ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అల్లర్లకు తెగబడే చాన్స్ ఉందని హెచ్చరించి ఉండొచ్చునని విశ్లేషిస్తున్నారు.
అదే సమయంలో మరో వాదన కూడా వినిపిస్తోంది. వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆ తర్వాత టీడీపీ కార్యకర్తల అంతు చూద్దామని భావనలో వైసీపీ శ్రేణులు ఉన్నాయని, అందుకే కేంద్ర నిఘా వర్గాలు ఎన్నికల రిజల్ట్స్ తర్వాత కూడా ఏపీలోని పలు ప్రాంతాల్లో దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించినట్లుగా మరో వర్షన్ వినిపిస్తోంది.