ప్రభుత్వాలు ప్రజలకు సమాచారం చేరవేయడానికి ప్రకటనలు ఇస్తూంటాయి. అయితే ఆధునిక ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న పార్టీలకు ప్రచారానికి ప్రజాధనాన్ని ప్రభుత్వ ప్రకటనల రూపంలో ఖర్చు చేస్తూంటారు. ఇంకా అత్యాధునిక ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాధినేతల మీడియా సంస్థలకే ఈ ప్రకటనలు అత్యధికంగా వెళ్తూంటాయి. ప్రజా సొమ్ము వారి ఖాతాలో చేరిపోతూంటాయి. ఈ ప్రకటనలకు ఎంత ఖర్చువుతోంది అన్నది ఎప్పటికప్పుడు హాట్ టాపిక్‌గానే ఉంది. తాజాగా లోక్‌సభలో కేంద్రం తాము ప్రకటనలకు ఎంత ఖర్చు చేస్తున్నామో తెలిపింది.
గత ఐదేళ్లలో దేశంలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనల కోసం రూ.3,339.49 కోట్లు ఖర్చు చేసినట్టు కేంద్రం తెలిపింది. అంటే సగటున ఏడాదికి రూ. 667 కోట్లు అనుకోవచ్చు. 2017-18 నుంచి ఈ ఏడాది జులై 12 వరకు ప్రింట్ మీడియాలో ప్రకటనలకు రూ.1756.48 కోట్లు, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనల కోసం రూ.1583.01 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపింది. అమ్మో… వేల కోట్ల ప్రజాధనం ఇలా ప్రకటనలకు పోతోందా అని చాలా మంది ఆశ్చర్యపోతూంటారు. కానీ రాష్ట్రాలు చేసే ప్రచార ఖర్చు గురించి తెలిస్తే నిజంగా కళ్లు తేలేస్తారు.
ఏపీ ప్రభుత్వం ఏటా ప్రచారానికి ఎంత ఖర్చు చేస్తుందో తెలియదు కానీ.. అన్ని రకాల మాధ్యమాలకు అంటే పేపర్, టీవీ, ఇంటర్నెట్, ఆన్ లైన్.. హోర్డింగ్‌లు ఇలా అన్నీ కలిపి కనీసం రూ. వెయ్యి కోట్ల వరకూ బడ్జెట్ పెడుతుందనే అంచనా ఉంది. ఇందులో అత్యధిక భాగంగా సీఎం కుటుంబానికి చెందిన సాక్షి పేపర్, టీవీ.. ఇంటర్నెట్ ఎడిషన్లకు వెళ్తాయి. మిగతావి ఇతర మీడియాకు పంచుతారు. తెలంగాణ సర్కార్ కూడా అంతే. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్న తరవాత ఆయన కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ప్రకటనలు ఇస్తున్నారు. ఇది వందల కోట్లలోనే ఉంటోంది. ఏడాది మొత్తానికి వేయి కోట్లు దాటిపోవడం ఖాయం.
పాలకులు ప్రజల సొమ్మును ఇలా ప్రచారాలకు ఖర్చు చేయడం ఫ్యాషన్‌గా మారిపోయింది. తమకు అధికారం ఇచ్చారు కాబట్టి ప్రజల సొమ్ముతో పార్టీ ప్రచారం చేసుకోవచ్చనుకుంటున్నారు. ఓ పార్టీ చేసిందని తాము.. వాళ్లు చేశారని వీళ్లు అధికారంలోకి వచ్చే పార్టీలు మార్చి మార్చి … ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూనే ఉన్నాయి.