గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడం రాజకీయంగా కలకలం రేపుతోంది. తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరైనా ఈ పిటిషన్ దాఖలు చేసి ఉంటే… రాజకీయ కారణాలతో అలా చేశారని అనుకోవడానికి అవకాశం ఉండేది. కానీ వైసీపీలో కీలకంగా ఉండే నేతలే కీలక ఆధారాలతో పిటిషన్ దాఖలు చేయడంతో… తెర వెనుక ఏం జరుగుతోందన్నదానిపై చర్చ ప్రారంభమయింది.
సత్తెనపల్లి నియోజకవర్గంలోని కోట నెమలపురి, కొండమొడు గ్రామాల్లో మొజాయిక్ లైమ్ స్టోన్స్ ఉన్నాయి. అక్కడ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా.. ఏడాది నుంచి తవ్వకాలు చేస్తున్నారని… వైసీపీ నేతలు.. రాజుపాలెం తాహశీల్దార్, మైనింగ్ అధికారులు, జిల్లా కలెక్టర్, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి వినతి పత్రాలు సమర్పించారు. వారి నుంచి స్పందన లేకపోవడంతో కోర్టులో పిటిషన్ వేశారు. అక్రమ మైనింగ్ ద్వారా మొజాయిక్ లైమ్ స్టోన్స్ ను రవాణా చేసిన ట్రాక్టర్ల నంబర్లను కూడా పిటిషన్లో పేర్కొన్నారు.
ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమ మైనింగ్ నిర్వహించి, మొజాయిక్ సున్నపురాయిని ఎగుమతులు చేసి కోట్లు గడిస్తున్నారని … అక్రమ మైనింగ్ తీవ్రమైన నేరమని సీబీఐతో విచారణ చేయించాలని వారు కోరుతున్నారు. ఈ అక్రమ మైనింగ్ పై పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని హై కోర్టు ధర్మాసనం ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. మైనింగ్ అధికారులు విచారణ చేసి ఉంటే నివేదికను కోర్టు ముందుంచాలని హైకోర్టు ధర్మాసనం సూచించింది. కేసు విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. ఈ పిటిషన్ వెనుక.. వైసీపీ కార్యకర్తలే ఉండటంతో అంతర్గత రాజకీయాలే కారణమని సులువుగానే అంచనా వేస్తున్నారు.
రేపల్లెకు చెందిన అంబటి రాంబాబు.. వైసీపీ తరపున సత్తెనపల్లిలో రాజకీయం చేస్తున్నారు. ఓ సారి ఎమ్మెల్యేగా ఓడిపోయి..మరోసారి గెలిచారు. గెలిచిన తర్వాత ఆయనపై నియోజకవర్గంలో సొంత పార్టీ క్యాడర్ నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పనులు..గనుల విషయంలో మొత్తం.. ఎమ్మెల్యేనే చూసుకుంటున్నారని..కార్యకర్తలకు ఏమీ దక్కనివ్వడం లేదనే అసంతృప్తి వారిలో కనిపిస్తోంది.ఈ అసంతృప్తే..హైకోర్టులో పిటిషన్ రూపంలో వెల్లడయిందని అంటున్నారు.