ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏం చేసినా కక్ష సాధింపుల కోణంలోనే చేస్తుందన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఇప్పుడు టెన్త్ పరీక్షల విషయంలో జరుగుతున్న పరిణామాలు కూడా అదే కోణంలో ఉన్నాయని చెబుతున్నారు. టెన్త్ పరీక్షల నిర్వహణ విషయంలో ప్రభుత్వం దారుణంగా ఫెయిలయిందన్న విమర్శలు వినిపిస్తున్నారు. పరీక్షా పత్రాలు అసలు విద్యార్థుల చేతికి చేరక ముందే వాట్సాప్‌లలో షేర్ అవుతున్నాయి. దీంతో ప్రభుత్వం టీచర్లపై కేసులు పెట్టి అరెస్ట్ చేస్తోంది. దాదాపుగా అరవై మంది ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు.
ఈ పరిణామాలు ఉపాధ్యాయుల్లోనూ తీవ్రమైన అలజడికి కారణం అవుతున్నాయి. అసలు పేపర్ లీక్ కాలేదని మంత్రి బొత్స చెబుతూనే… అరవై మందిని అరెస్ట్ చేశామని చెబుతున్నారు. ఇదంతా గందరగోళంగా ఉన్నట్లుగా కనిపిస్తున్నా.. ప్రభుత్వం పీఆర్సీతో పాటు సీపీఎస్ సమస్యలపై ఉద్యమనిస్తున్న టీచర్లపై కక్ష సాధింపుల కోసమే ఈ పరిణామాల్ని వాడుకుంటోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నేతలు అదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అరెస్టయిన వారంతా ఉద్యమంలో కాస్త చురుగ్గా ఉండేవారేనని చెబుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం అలాంటిదేమీ లేదని చెబుతోంది. తాము టార్గెట్ చేస్తే ఉద్యోగ సంఘాలు ఊరక ఉంటాయా అని వాదిస్తున్నారు.
కానీ వారు కూడా తమపై కుట్ర జరుగుతోందని ఇప్పటి వరకూ ఓ అంచనాకు రాలేకపోయారు. ఇప్పుడే క్లారిటీ వస్తూండటంతో రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. ఇలా టీచర్లపై కేసులు పెట్టి.. రేపు సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కకుండా బ్లాక్ మెయిల్ చేసే భారీ వ్యూహం అమలు చేస్తున్నారని ఇప్పటికే ఉద్యోగ సంఘాలు ఓ నిర్ణయానికి వచ్చాయి. మరి వారు ప్రభుత్వనికి లొంగిపోతారా ? పోరాడతారో వేచి చూడాలి !