నిజామాబాద్ నుంచి కల్వకుంట్ల కవిత ఎంపీగా పని చేశారు. మరోసారి ఓడిపోయి ఉండవచ్చు కానీ.. ఆ జిల్లా రాజకీయాలు ఆమె కనుసన్నల్లోనే జరుగుతూ ఉంటాయి. ఇటీవల ఎమ్మెల్సీగా కూడా ఎన్నికయ్యారు. మామూలుగా ఆ జిల్లాలో కేసీఆర్ పర్యటన ఉంటే.. మొత్తం కవిత కనుసన్నల్లో జరగుతుంది. కానీ ఈ సారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అసలు కవిత ప్రస్తావనే ఎక్కడా రాలేదు. సీఎం సభ ఏర్పాట్లలో కూడా ఆమె ప్రమేయం లేకుండా పోయింది.
నూతనంగా నిర్మించిన జిల్లా టీఆరెస్ కార్యాలయం, కొత్త కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవంలో కూడా కవిత కనిపించలేదు. నేరుగా బహిరంగ సభకు వచ్చి సీఎం ప్రసంగం ముగియగానే వెళ్లిపోయారు. కనీసం పార్టీ ఎమ్మెల్యేలతో కూడా కవిత సరిగ్గా మాట్లాడలేదు. జిల్లాలో టీఆరెస్ శ్రేణులకు పెద్ద దిక్కుగా ఉన్న కవిత కొంత కాలంగా జిల్లాకు దూరంగా ఉండటం సీఎం కేసీఆర్ సభ ఉండటం కనీసం సభ ఏర్పాట్లను చూసేందుకైనా రాలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇటీవల కాలంలో కవిత జిల్లా పై ఫోకస్ పెట్టడం కూడా మానేశారు. కొద్ది రోజుల కిందట మళ్లీ నిజామాబాద్ఎంపీగా పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారన్న ప్రచారం జరిగింది. కానీ లిక్కర్ స్కాం ఆరోపణలతో మొత్తం తలకిందలయినట్లుగా భావిస్తున్నారు. సీఎం సభలో ప్రసంగించిన ఎమ్మెల్యేలు సైతం కవిత పేరు ఎత్త లేదు. దీంతో .. కవితను సైడ్ చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.