కడప జిల్లా ప్రొద్దుటూరులో రెండు రోజులుగా సంచలనం సృష్టించిన మైనార్టీ ఫ్యామిలీకి చెందిన భూ కబ్జా వ్యవహారాన్ని ఆదివారం సెటిల్ చేశారు. తాను ఆత్మహత్య చేసుకుంటానని బాధితుడు కుటుంబంతో సహా సెల్ఫీ వీడియో తీసుకుని పెట్టడం దానికి మీడియా ప్రాధాన్యం ఇవ్వడంతో సీఎంవో వెంటనే స్పందించింది. ఆ భూకబ్జాకు పాలపడింది ఎవరో కాదు సీఎం బంధువు ఇరుగం తిరుపాల్ రెడ్డి అనే వ్యక్తి. దాంతో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే పట్టించుకోలేదు… వైసీపీ పోలీసులుగా మారిపోయిన వ్యవస్థలో భాగమైన సీఐ ఆ భూమిని వదులుకోకపోతే ఎన్కౌంటర్ చేస్తానని బాధితుడ్నే బెదిరించాడు. చివరికి అది వైరల్ అయింది.
సీఎం జగన్ ఈ ఘటనపై కలత చెందారు. తక్షణ చర్యలకు ఆదేశించారు. అంత వరకూ బాగానేఉంది. కానీ చర్యలంటే ఏమిటి కబ్జాలకు ప్రయత్నించిన వారిపై కేసులు పెట్టిలోపలేయాలి. సివిల్ పంచాయతీలో వేలు పెట్టి ఎన్ కౌంటర్ చేస్తానని మాఫియాలాగా బెదిరించి భూమిని లాగేసేందుకు ప్రయత్నించిన సీఐను తక్షణం పోలీసు ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలి. ఇలాంటి చర్యలు ఆశిస్తారు..కానీ ప్రొద్దుటూరులో ఏం జరిగింది. ఎస్పీ బాధిత కుటుంబాన్ని పిలిచి రాజీ చేశారు. మీ భూమి మీకు ఉండేలా చేస్తాం..ముఖ్యమంత్రి బాగా స్పందించారు.. ఆదుకున్నారని ప్రకటన ఇవ్వాలని తేల్చేశారు. దానికేం మహాభాగ్యం అని ఆ బాధితుడు అదే స్టేట్మెంట్ ఇచ్చాడు. సమస్య పరిష్కారం అయిపోయిందని పోలీసులు ప్రకటించారు.
అంటే ఈ వ్యవహారంలో కబ్జాకు గురైన భూమిని వెనక్కి ఇప్పించడంతోనే సమస్య పరిష్కారం అయింది. కానీ తప్పుడు పనులు చేసిన వారికి మాత్రం శిక్ష పడలేదు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న సీఐ కొండా రెడ్డిని విధుల నుంచి తప్పించినట్లుగా ప్రచారం చేశారు. కానీ రెండు రోజులు మాత్రమే ఆయనను విధుల నుంచి దూరంగా ఉండమన్నారు. ఇప్పుడు ఆయన విధుల్లో చేరిపోతారు. కానీ ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడతామని చెబితే తప్ప కదలిక రాలేదు. ఇంకెన్ని వెలుగులోకి రాని కబ్జాలు అలా జరిగాయో అంచనా వేయడం కష్టం. మహిళలపై దాడుల్లో నిందితుల్ని లైట్ తీసుకుని బాధితులకు ప్రజాధనం పరిహారం ఇచ్చి సరి పెడుతున్నట్లుగా.. ఇక్కడా సెటిల్మెంట్లు చేసి నిందితుల్ని కాపాడుతున్నారన్న విమర్శలు అందుకే వస్తున్నాయి.