ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో తుపాన్ బీభత్సం సృష్టించింది. ఏపీలో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పటికీ తేరుకోలేదు. కొన్ని వందల గ్రామాల్లో అంధకారం అలుముకుంది. ఇక నష్టపోయిన వారి గురించిచెప్పాల్సిన పనిలేదు. అటు తెలంగాణలోనూ అంతే ఉంది. పలు జిల్లాలు ఎఫెక్ట్ అయ్యాయి. అయితే మీడియా చానళ్లు మాత్రం సినిమా రంగం.. మా ఎన్నికలు.. పవన్ కల్యాణ్ ట్వీట్లు.. ఆయనపై ఇతరుల విమర్శలు చుట్టూనే తిరుగుతోంది. రోజంతా అంతే చివరికి పోసానిని మరోసారి మీడియా ముందుకు తీసుకొచ్చి గంట సేపు పంచాంగం వినిపించారు. దాంతో టీఆర్పీలు పెంచుకున్నాయి.
కానీ మీడియా బాధ్యతగా ప్రజల కష్టాలను పట్టించుకునే పరిస్థితే ఎక్కడా కనిపించలేదు. బాగా అద్బుతమైన విజువల్స్ కనిపిస్తే మాత్రం కొద్ది సేపు చూపించి మళ్లీ సినిమా వాళ్లదగ్గరకు వెళ్లింది. మీడియా ఇలాంటి సమయంలోనే ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపితే తక్షణం స్పందించి బాధితులకు న్యాయం అందిస్తుంది. కానీ ప్రస్తుతం మీడియాకు అంత తీరిక లేదు. ప్రజల కోసం అని చెప్పుకునే మీడియా ఇప్పుడు ప్రజల కోసం కాకుండా.. కొంత మంది ప్రయోజనాల కోసం పని చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. నిజమైన బాధితుల్ని గాలికొదిలేసి సినిమా వివాదాల చుట్టూ తిరుగుతోంది.
ఉత్తరాంధ్ర, తెలంగాణల్లో కొన్ని లక్షల మంది వరద బాధితులు ఉన్నారు. ఎన్నో హృదయవిదారక దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. కానీ వేటినీ మీడియా పట్టించుకోవడం లేదు. ఇటీవలే సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ జరిగిన రోజున ఆరేళ్ల పాపపై జరిగిన దారుణాన్ని చూపించకుండా .. సినిమా వాళ్ల వెంటపడటంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు వరద బాధితుల విషయంలోనూ మీడియా అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది.