బాలినేని శ్రీనివాసరెడ్డి తనకు రోజూ పార్టీలో అవమానాలు ఎదురవుతున్నాయని పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఆయనను బుజ్జగిస్తున్నామని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. కానీ అలాంటి ప్రయత్నాలేమీ జరగకపోగా వచ్చే ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ టిక్కెట్ కూడా లేదన్న సంకేతాలను ఇస్తున్నారు. ఇది బాలినేనిని మరింత ఆవేదనకు గురి చేస్తోంది. ఇటీవల ప్రోటోకాల్ వివాదం తర్వాత జగన్ ఆయనను ప్రత్యేకంగా పిలిపించుకుని ఆయన చేతనే విద్యా దీవెన పథకం బటన్ నొక్కించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇక బాలినేని మాటే ఫైనల్ అన్న సంకేతాలు జగన్ ఇచ్చారని ఆయన వర్గీయులు అనుకున్నారు.
కానీ జగన్ అలా వెళ్లిపోయిన తర్వాత ఇలా పరిస్థితి మారిపోయింది. ఒక్క రూ బాలినేనిని పట్టించుకోవడం లేదు. పార్టీ నుంచి కూడా ఆయన ఎలాంటి సమాచారం లేకుండా పోయింది. అంతర్గతంగా బాలినేనికి వ్యతిరేకంగా పలు నిర్ణయాలు జరిగాయి. అధికారుల బదిలీలతో పాటు.. పలు నియోజకవర్గాల్లో తాను పెట్టిన వారిని తప్పించడం ప్రారంభించారు. ఈ వ్యవహారాలతో ఆయనకు ఉక్కపోత ప్రారంభమయింది. చివరికి ఆయన పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు.
అయితే బాలినేనిని అసలు పార్టీ నుంచి వెళ్లగొట్టే వ్యూహం అమలు చేస్తున్నారని ఆ విషయం బాలినేనికే అర్థం కావడం లేదని ఆయన అనుచరులు మథనపడుతున్నారు. ప్రకాశం జిల్లాలో ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి హవా నడుస్తోంది. బాలినేనిని పూర్తిగా పక్కన పెట్టేశారు. కళ్ల ముందే అన్నీ కనిపిస్తున్నా.. జగన్ తనను మోసం చేయరన్న భావనలో బాలినేని ఉన్నారంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా బాలినేనికి టిక్కెట్ లేదన్న సంకేతాలను ఇప్పటికే పంపారు. రేపోమాపో బాలినేని మరిన్ని అవమానాలకు గురవుతారు. ఆవేశంతో రాజీనామా చేస్తారని ఇక ఆయన వైసీపీకి లేనట్లేనని ఆ పార్టీ పెద్దలు ఓ అంచనాకు వచ్చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.