నంద్యాల ఫలితాల అనంతరం వైసిపి పార్టీ క్యాడర్ డీలా పడిన మాట తెలిసిందే. అయితే జగన్ లో మాత్రం ఉత్సాహం ఎంతమాత్రం తగ్గినట్టు లేదు. ఫలితాలొచ్చిన ఆ రెండ్రోజులు కొంచెం డల్ గా కనిపించినా మళ్ళీ ఇప్పుడు యధావిధిగా తన పార్టీ స్కీములని జనాల్లోకి తీసుకెళ్ళే పనిలో పడ్డాడు. ట్విట్టర్ సాక్షిగా జగన్ రాష్ట్రప్రజలకి పిలుపునిచ్చాడు. వైఎస్ ఆర్ కుటుంబం లో భాగస్వాములు కావాలని ప్రజలకి జగన్ పిలుపునిచ్చాడు.
ఇంతకీ ఈ పథకం ఏంటంటే – వైసిపి పార్టీ వాళ్ళు ఇచ్చిన ఒక నంబర్ కి కాల్ చేస్తే ఆ పార్టీ కార్యాలయం వాళ్ళు మాట్లాడుతారు. మన సమస్య ఏంటో చెబితే వాళ్ళు నోట్ చేసుకుంటారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక దాని పరిష్కరిస్తారు. అలాగే కాల్ చేసిన వాళ్ళకి ఆటొమేటిగ్గా పార్టీ సభ్యత్వం వచ్చేస్తుంది. కేవలం సభ్యత్వం మాత్రమే కావాలంటే అదే నంబర్ కి మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. తొలిరోజే దాదాపు నాలుగు లక్షల మంది సభ్యులుగా చేరారని వైసిపి వర్గాలు ఆనందగా ఉన్నాయి.
అయితే ఈ స్కీం లోని కొన్ని లోపాలున్నాయంటున్నారు విశ్లేషకులు. ఎవరైనా ఫోన్ చేసి సమస్య చెబితే దానికోసం వైసిపి ఏమీ చేయదు. కేవలం దాన్ని నోట్ చేసుకుంటుంది. వైసిపి అధికారం లోకి వచ్చాక మాత్రమే దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి పథకం వల్ల అధికారం పొందాలనే జగన్ తాపత్రయాన్ని ప్రజలకి మరోసారి గుర్తు చేసినట్టేనంటున్నారు విశ్లేషకులు. ప్రజాసమస్యల పరిష్కారానికి అధికారం అవసరం లేదంటూ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కొత్త ఒరవడిలో వెళ్తూ ఉద్దానం లాంటి సమస్యలని పరిష్కరిస్తూనో లేదా పరిష్కారానికి ప్రయత్నిస్తూనో ఉంటే జగన్ అన్నిటినీ కేవలం తాను అధికారం లోకి వచ్చాక మాత్రమే పరిష్కరిస్తానని చెప్పడం సరి కాదంటునారు. దాని కంటే ముఖ్యంగా వైఎస్ ఆర్ కుటుంబం అన్న పేరు పెట్టి ప్రతి కార్యకర్తా ఆ కుటుంబ సభ్యుడే అని చెప్పే ఉద్దేశ్యం మంచిదే అయినా, వై ఎస్ ఆర్ కుటుంబం అని టైటిల్ పెట్టి, బ్యానర్లు ఫ్లెక్సీలు అన్నినిటిలో కేవలం రాజశేఖర రెడ్డి,విజయమ్మ, జగన్ ల ఫోటొలు పెట్టడం వల్ల ఇది వాళ్ళ కుటుంబానికి సంబంధించిన లేక వాళ్ళ కుటుంబానికి మాత్రమే మేలు చేసే స్కీం లాగా ఉందనే సంకేతాలు ప్రజల్లోకి పంపినట్టుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీలకు, ప్రత్యేకించి ప్రజలకి సంబంధించిన అంశాల్లో ఇలాంటి సెల్ఫ్-సెంట్రిక్ ఆలోచనావిధానం మంచిది కాదని విశ్లేషకుల ఉవాచ.