విద్యాశాఖ మంత్రి పదవి ఇచ్చారని.. తానేంటి..? విద్యాశాఖ ఏంటీ ? అనుకుంటున్న బొత్స సత్యనారాయణకు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారాయి. ఆయన చార్జ్ తీసుకోక ముందే పరీక్షలు ప్రారంభమయ్యాయి. అ పరీక్షలు బొత్సపై పెద్ద అగ్నిపరీక్షగా మారాయి. పరీక్షల నిర్వహణలో తన ప్రమేయం ఒక్క శాతం లేపోయినా.. ఇప్పుడు అందులో వైఫల్యాలన్నీ ఆయన ఖాతాలోనే పడుతున్నాయి. పదో తరగతి పరీక్ష పేపర్ ప్రతీ రోజూ లీకవుతోంది. అసలే పేపర్లన్నీ తగ్గించేసి ఏడు పేపర్లతో టెన్త్ పరీక్షలు పెడుతున్నారు.
ఆ పరీక్షల్ని కూడా పూర్తి సన్నద్దతతో నిర్వహించడం లేదు. ప్రతీ రోజూ ఎగ్జామ్ ప్రారంభం కాగానే పేపర్ లీక్ అని ప్రచారం జరగడం…. కొంత మందిని అరెస్ట్ చేయడం కామన్‌గా మారిపోయింది. దీంతో బొత్స సత్యనారాయణ తనపై కుట్ర జరుగుతోందని అనుమానపడటం మొదలు పెట్టారు. నేరుగా తమ పార్టీలోని వారిని అనలేరు కాబట్టి… టీడీపీ నేతలు అనడం ప్రారంభించారు. కానీ వైసీపీవాట్సాప్ గ్రూపుల్లోనే లీకైన పరీక్షా ప్రశ్నా బత్రాలు బయటపడుతూండటం కలకలం రేపుతోంది.
ఏం జరుగుతుందో బొత్సకూ అర్థం కావడం లేదు. విద్యా మంత్రిగా తనను బ్యాడ్ చేసేందుకు ఓ ప్రయత్నం అయితే జరుగుతోందని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. ఆయన అనుమానం టీడీపీపై కాదు.. మాటల్లో టీడీపీ అంటున్నా.. అసలు అనుమానం సొంత పార్టీపైనే ఉంది. తనకు నప్పని శాఖను ఇవ్వడమే కాకుండా ఇప్పుడు చేతకాని వాడనే ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న అనుమానం ఆయనలో బలపడుతోంది.