శంకర్ రాసుకున్న `ఇండియన్ 2` కథలో ఎన్ని ట్విస్టులు ఉన్నాయో తెలీదు గానీ – ఈ ప్రాజెక్టుకు రోజుకో ట్విస్టు ఎదురవుతోంది. ఇండియన్ 2.. ప్రాజెక్టు దర్శక నిర్మాతల మధ్య అభిప్రాయ బేధాలతో ఆగిపోయిన సంగతి తెలిసిందే. శంకర్ ఈ సినిమా పూర్తి చేసేంత వరకూ మరో సినిమా చేయకుండా ఆపాలని.. నిర్మాతలకు కూడా మద్రాస్ హైకోర్టులో పిటీషన్ వేశారు. ఈ విషయంలో కోర్టు కూడా ఏం చెప్పలేకపోయింది. `మీలో మీరు తేల్చుకోండి` అంటూ నిర్ణయాన్ని దర్శక నిర్మాతలకే వదిలేసింది. అయితే ఇప్పుడు మద్రాస్ హైకోర్టు ఓ పరిష్కార మార్గం సూచించింది. ఈ కేసులో మధ్యవర్తిగా ఓ మాజీ న్యాయమూర్తిని నియమించింది. శంకర్కీ, లైకా ప్రొడక్షన్కీ మధ్య రాజీ కుదర్చడానికి ఇది వరకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కమల్ కూడా…. రాజీ కుదర్చే ప్రయత్నం చేశాడు. కానీ వీలు కాలేదు. ఇప్పుడు మాజీ న్యాయమూర్తి రంగంలోకి దిగారు. ఇప్పుడైనా ఈ సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుందేమో చూడాలి. మరోవైపు శంకర్.. రామ్ చరణ్ ప్రాజెక్టులో బిజీ అవుతున్నాడు. చెన్నైలో కథా చర్చలు జోరుగా నడుస్తున్నాయి. త్వరలోనే చరణ్ కి ఫైనల్ నేరేషన్ ఇవ్వబోతున్నాడని, ఆ తరవాత చరణ్ నిర్ణయం తీసుకుంటాడని సమాచారం.