`మా`లో ఓ సంప్రదాయం ఉండేది. అధ్యక్షుడ్ని ఏక గ్రీవంగా ఎన్నుకుంటూ వచ్చేవారు. అయితే గత కొన్నేళ్లుగా ఆ సంప్రదాయం పోయింది. అసెంబ్లీ ఎన్నికలంతా హడావుడి `మా` ఎలక్షన్లకు వచ్చేసింది. వాగ్దానాలు, ప్రత్యారోపణలు… జోరుగా సాగుతున్నాయి. ఈసారి అయితే.. మూడు నెలల ముందే ఎన్నికల సమరశంఖం మోగించేశారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు, ఏకంగా నలుగురు పోటీకిసిద్ధమయ్యారు.
అయితే.. ఈసారి ఎన్నికలు లేకుండా.. ఏకగ్రీవంగా అధ్యక్షుడ్ని ఎంచుకుంటే బాగుంటుందన్నది సినీ పెద్దల ఆలోచన. చిరంజీవి, కృష్ణంరాజు, మోహన్ బాబు.. వీళ్లంతా కలిసి, ఓ మీటింగ్ ఏర్పాటు చేసి, `మా` ఎన్నికలు లేకుండానే అధ్యక్షుడ్ని ఏకగ్రీవం చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ కామెంట్లు కూడా అందుకు బలాన్ని చేకూర్చేలా ఉన్నాయి. “మా ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. మధ్యలో జరగాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఈలోగా ఇంత తొందర ఎందుకో అర్థం కాదు. ఈసారి మా అధ్యక్షురాలిగా ఓ మహిళకు అవకాశం ఇద్దామనుకున్నాం. ఏకగ్రీవంగా ఎన్నుకుంటే బాగుంటుంది అనిపించింది. క్రమశిక్షణ సంఘం కూడా అదే ఆలోచిస్తోంది. పెద్దలు కూర్చుని మాట్లాడుకోవాలి. ఆ తరవాత నిర్ణయం తీసుకుంటారు..“ అని నరేష్ చెప్పుకొచ్చారు. ఈసారి అధ్యక్ష పీఠం మహిళకే దక్కాలంటే… జీవితకి ఆ ఛాన్సు ఉంటుంది. కాకపోతే… పెద్దలు చెబితే, వినే స్థితి ప్రకాష్ రాజ్, విష్ణులకు ఉందా? ఒకరికే ఎంచుకోవాలంటే ఆ పీఠం ఎవరికి ఇస్తారు? అనేది మరో పెద్ద ప్రశ్న. గతంలో కూడా ఇలానే ఎన్నికల వేడి తట్టుకోలే, అధ్యక్షుడ్ని ఏకగ్రీవంగా ఎంచుకోవాలనిచూశారు. కానీ కుదర్లేదు. ఈసారీ అదే సీన్ రిపీట్ అవ్వొచ్చు.