నాగార్జున నటించిన సినిమా `వైల్డ్ డాగ్`. పూర్తి స్థాయి యాక్షన్ థ్రిల్లర్ ఇది. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈసినిమాని ఓటీటీలో విడుదల చేయనున్నారని టాక్. నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిందని, సంక్రాంతికి ఇంట్లోనే ఈ సినిమా చూసేయొచ్చని అంటున్నారు. దాదాపుగా ఎగ్రిమెంట్లన్నీ ఓ కొలిక్కి వచ్చేశాయి. అయితే నెట్ ఫ్లిక్స్ దగ్గర ప్లాన్ బి కూడా ఉందట.
ముందు ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేసి, మూడు రోజుల తరవాత.. నెట్ ఫ్లిక్స్లోకి తీసుకురావాలని భావిస్తున్నారు. సంక్రాంతి మంచి సీజన్. ఈ సీజన్లో వసూళ్లు బాగుంటాయి. అందుకే కనీసం మల్టీప్లెక్స్ లో అయినా ఈ సినిమాని విడుదల చేయాలని చూస్తున్నారు. ఆ బాధ్యత కూడా నెట్ ఫ్లిక్సే చూసుకోబోతోందట. థియేటరికల్ రిలీజ్ చేసే హక్కు ఇప్పుడు నిర్మాతల చేతుల్లో లేదు. అది ఓటీటీకి వెళ్లిపోయినట్టే. కావాలంటే థియేటర్లోనూ విడుదల చేసుకుంటారు. లేదంటే ఓటీటీతో సరిపెడతారు. సినిమాపై నమ్మకం ఉండి, థియేటర్ల వరకూ జనాలు వస్తారు, చూస్తారు అనుకుంటే.. అటు ఓటీటీలోనూ, ఇటు వెండి తెరపైనా ఒకేసారి ఈ సినిమా చూడొచ్చు. సంక్రాంతికి థియేటర్ల వ్యవస్థ ఓ క్రమ పద్ధతిలోకి రాకపోతే.. నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తుంది.