మంత్రివర్గ విస్తరణ నేడో రేపో జరగడం ఖాయమే కావొచ్చు. ఇప్పటికే ఆలస్యమైపోయింది. అడిగేవారు లేకపోవచ్చు కానీ.. ప్రజల్లో.. పార్టీల్లో ఓ నిర్లిప్తత అయితే ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకే కేసీఆర్.. పరిమితంగా విస్తరణ చేయాలనుకుంటున్నారు. గత కేబినెట్ కూడా రెండు సార్లు విస్తరించారు. లక్కి నెంబర్ పై విపరీతమైన సెంటిమెంటును పెట్టుకున్న కేసిఆర్ తన కార్ల నెంబర్లు, ఫోన్ నెంబర్లు, చివరికి అసెంబ్లీ రద్దు కూడా సెప్టెంబర్ 6న, పార్టీ తొలి విడత అభ్యర్థుల సంఖ్య కూడా 6 వచ్చేలా 105 మందిని ప్రకటించారు. ఇప్పుడు కూడా లక్కీ నెంబర్ ప్రకారంగా విస్తరణ జరుపుతారన్న చర్చ జరుగుతోంది. 6 నుండి 13 మందిని కేబినెట్ లోకి తీసుకుంటారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
మంత్రి పదవులు ఆశిస్తున్న ఆశావాహులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలతో కలిపి దాదాపు 40 మంది వరకు ఉన్నారు. లోక్ సభ ఎన్నికల బాధ్యతలిస్తారు కాబట్టి కేటిఆర్, హరీశ్ రావులకు చాన్స్ లేనట్లేనని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఒకే స్వభావం ఉండే శాఖలకు ఒకే మంత్రి ఉండాలని ఇదివరకే నిర్ణయం తీసుకున్నారు కేసిఆర్. అత్యంత కీలక శాఖగా పేరున్న ఇరిగేషన్, పంచాయితి రాజ్ లను కేసిఆరే స్వయంగా నిర్వహిస్తానని కూడా చెప్పారు. ఇక పార్టీలో 6 సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, గత కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ ఈ సారి మంత్రివర్గంలో కూడా ఆర్థిక మంత్రిగా అసెంబ్లీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశమున్నట్లు చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికల కేంద్రంలో పరిస్థితులను బట్టి కేబినెట్ పునర్ వ్యవస్థీకరించడం లేదా విస్తరించవచ్చని తెలుస్తోంది.
సామాజిక వర్గాల కూర్పులో భాగంగా మొదటి దశలో ఎస్టీ సామాజిక వర్గం నుండి ఒకరికి ప్రాతినిధ్యం కల్పించే అవకాశం ఉంది. ఆదిలాబాద్ ఎమ్మెల్యే రేఖానాయక్ కు కేబినెట్ బెర్త్ దాదాపు ఖరారయిందని చెబుతున్నారు. దీంతో కేబినెట్ లో మహిళలకు చోటులేకుండా పోయిందన్న విమర్శలకు కూడా ఫుల్ స్టాప్ పెట్టినట్టవుతుందని కేసిఆర్ భావిస్తున్నారట..లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో నల్గొండ జిల్లా నుండి ఒకరికి కేబినెట్ బెర్త్ తప్పక దక్కే అవకాశాలున్నాయి. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి,ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిలలో ఒకరికే చోటు కల్పించనున్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో ఒకరికి ఛాన్స్ ఇవ్వనున్నారు..మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కుడా అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరికి చాన్సిచ్చినా.. అది లక్కీ నెంబర్ కలసి రావాలి. లేకపోతే.. లోక్ సభ ఎన్నికల వరకూ ఆగాల్సిందే..!